ప్రాధాన్య పథకం (ప్రయారిటీ ప్లాన్) విషయంలో వొడాఫోన్ ఐడియాపై దర్యాప్తు చేపట్టే నిర్ణయాన్ని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఉపసంహరించుకుంది. ఈ పథకం కింద వినియోగదారులకు అత్యధిక డేటా వేగాన్ని అందించే విషయంలో కంపెనీ వెనక్కి తగ్గడం, పథకంలో మార్పులు చేయడం ఇందుకు కారణం. ఈ పరిణామంతో ప్రాధాన్య పథకం వివాదానికి తెరపడినట్లయ్యింది.
వారికి ప్రాధాన్యంతో పథకం
ప్రీమియం వినియోగదారులకు నెట్‌వర్క్ విషయంలో ప్రాధాన్యం, అత్యధిక వేగం అందిస్తామంటూ వొడాఫోన్ ఐడియా పేర్కొనడంపై విచారణ చేపట్టాలని ట్రాయ్ భావించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గత నెలలో వొడాఫోన్ ఐడియాకు షోకాజ్ నోటీసులను పంపింది. టారిఫ్ ఆఫర్ పారదర్శకంగా లేదని, తప్పుదారి పట్టించే విధంగా ఉందని, నియంత్రణ నిబంధనలకూ విరుద్ధంగా ఉందని అందులో పేర్కొంది.