టెలికాం సంస్థలు తమ ఛార్జీల (టారిఫ్)ను మరింత పారదర్శకంగా, స్పష్టంగా, వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా వెల్లడించాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది. సమగ్ర సమాచారం లేకపోవడం, పథకాల వివరాలు అర్థం చేసుకునేందుకు క్లిష్టంగా ఉండటం వల్ల వినియోగదారులు తమకు కావాల్సిన పథకాలను ఎంచుకోలేకపోతున్నారని ట్రాయ్ వివరించింది. ఆఫర్లనూ వినియోగదార్లు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని, నిర్ణయం తీసుకునేలా ఉండాలని పేర్కొంటూ, తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.
'కొన్ని టెలికాం సంస్థలు ఆయా టారిఫ్ పథకాలు అమలయ్యేందుకు ఉండే అదనపు షరతులను ఒకే వెబ్ పేజీల్లో స్పష్టంగా వెల్లడించడం లేదు. అధిక సమాచారం నేపథ్యంలో, వినియోగదారులకు గందరగోళం ఏర్పడుతోంది. అందువల్ల ఆయా సేవలు, పథకాలు అమలయ్యే ప్రాంతాల వారీగా పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్రతి పథకం టారిఫ్‌ల గురించి వినియోగదారులకు సమాచారం ఇవ్వాలి. వినియోగదారు సేవా కేంద్రాలు, రిటైల్ విక్రయశాలలు, వెబ్‌సైట్, యాప్‌లలోనూ ఈ సమాచారం ఉండాలి. కాల్, ఎస్‌ఎంఎస్, డేటా ధరలు, పరిమితులు వంటివీ స్పష్టంగా వెల్లడించాల'ని కోరింది.