అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై వ్యాపారుల 'నిరసన' గళం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లను నిషేధించాలని డిమాండ్ చేస్తూ దేశీయ వాణిజ్య సంఘాలు బుధవారం 'జాతీయ నిరసన దినాన్ని' నిర్వహించాయి. దేశవ్యాప్తంగా సుమారు 700 నగరాల్లో నిర్వహించిన ఆందోళనల్లో లక్షలాది వ్యాపారులు పాల్గొన్నారు.
"అమెజాన్, ఫ్లిప్‌కార్ట్... 'అనైతిక వాణిజ్య పద్ధతులను' అవలంబిస్తున్నాయి. ప్రభుత్వ ఎఫ్‌డీఐ విధానాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి. ఫలితంగా భారత ఈ-కామర్స్ విపణి అత్యంత విషపూరితమైంది. ప్రభుత్వం ఈ రెండు ఈ-కామర్స్ సంస్థలను వెంటనే నిషేధించాలి."- అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ)
అభ్యంతరం ఏంటంటే...
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారత్‌లో వ్యాపారం చేయడంపై తమకు అభ్యంతరం ఏమీ లేదన్నారు సీఏఐటీ అధ్యక్షుడు బీసీ భర్టియా. అయితే వ్యాపారుల తరహాలో ఈ సంస్థలు కూడా ప్రభుత్వ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) విధానాన్ని, ఇతర పన్ను చట్టాలని కచ్చితంగా అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. చట్టాలను పాటించే వరకు ఈ రెండు సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల వ్యాపార నమూనాలు, వాటి ఖాతాలు, విదేశీ పెట్టుబడులు, వాటి ఉత్పత్తుల పంపిణీ తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కూడా సీఏఐటీ డిమాండ్ చేసింది.
ఇదీ చూడండి:వాట్సాప్‌ను వెంటనే అప్డేట్ చేసుకోండి.. లేదంటే అంతే!