ఫ్రెంచ్ సంస్థ టోటల్, అదానీ గ్రూప్ కలయికతో నూతనంగా ఏర్పాటైన జాయింట్ వెంచర్.. భారత్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు విషయమై ప్రభుత్వం అనుమతులు కోరనుంది.
టోటల్-అదానీ ఫ్యూయెల్స్ మార్కెటింగ్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటైన ఈ జాయింట్ వెంచర్.. రిటైల్ అవుట్లెట్ల ద్వారా అమ్మకాలు జరిపేందుకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేయనున్నట్లు అదానీ గ్యాస్ సీఈఓ సురేశ్ మంగ్లానీ తెలిపారు.
నేచురల్ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇంధనాలతో పాటు విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ సౌకర్యాలను కల్పించేందుకు 'టోటల్-అదానీ' కసరత్తులు చేస్తోంది. రిటైల్ ఇంధన రంగంలో సరళీకృత విధానాలవైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. గతేడాదే 'అదానీ గ్యాస్'లో 37.5 శాతం వాటాలను టోటల్ సొంతం చేసుకుంది.