నైపుణ్యాలు, ప్రతిభ కలిగిన వారిని నియమించుకుంటూ, నికరంగా అధిక కొలువులు (Job alert) ఇచ్చే రంగంగా భారత ఐటీ రంగం నిలుస్తోందని ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. 2021-22లో 96,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని అగ్రశ్రేణి 5 ఐటీ కంపెనీలు ప్రణాళిక సిద్ధం చేశాయని పేర్కొంది. యాంత్రీకరణతో (ఆటోమేషన్) సాఫ్ట్‌వేర్ సంస్థల్లో వచ్చే ఏడాది సుమారు 30 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక అంచనా వేసిన నేపథ్యంలో నాస్కామ్ ఈ ప్రకటన విడుదల చేసింది.
"సాంకేతిక పరిణామం, పెరుగుతున్న ఆటోమేషన్ సంప్రదాయ ఐటీ ఉద్యోగాల స్థానంలో కొత్త ఉద్యోగాల సృష్టికి దారి తీస్తుంది. ఈ పరిశ్రమ ప్రతిభ, నైపుణ్యాలు ఉన్న వారిని చేర్చుకుంటూనే ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) సుమారు 1,38,000 మందిని నియమించుకోవడం వల్ల మొత్తం ఉద్యోగుల సంఖ్య 45 లక్షలకు చేరింది" అని నాస్కామ్ వెల్లడించింది. పరిశ్రమ 2.5 లక్షల మందికి డిజిటల్ నైపుణ్య శిక్షణ అందిస్తోందని, 40,000 మంది డిజిటల్ నైపుణ్య శిక్షణ పొందిన కొత్త ప్రతిభావంతుల్ని నియమించుకుందని పేర్కొంది. 2025 నాటికి 30,000-35,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.22.50-26.25 లక్షల కోట్ల) ఆదాయ లక్ష్యంతో పరిశ్రమ ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. 2021 మార్చి ఆఖరుకు ఐటీ-బీపీఎం రంగంలో మొత్తంగా 45 లక్షల మంది పని చేస్తున్నారని వివరించింది.