త్రైమాసికంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు క్షీణిస్తోంది. 2018-19 తొలి త్రైమాసికంలో 8.0 శాతంగా ఉన్న వృద్ధిరేటు అయిదు శాతానికి తగ్గింది. 2019-20 రెండో త్రైమాసికంలో అది 4.5 శాతానికి చేరింది. ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక 2019లో భారత జీడీపీ వృద్ధిరేటు దాదాపు 7.5 శాతం వరకు ఉండొచ్చని, అది ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకశక్తిలా పని చేస్తుందని పేర్కొంది. ఆ అంచనాలకు విరుద్ధంగా 2019-20లో జీడీపీ వృద్ధి అయిదు శాతంకన్నా తక్కువగానే ఉండొచ్చనేది తాజా అంచనా. ఏడాది కాలంలో మందగమనానికి ప్రపంచస్థాయి అంశాలే కాకుండా జీఎస్టీ, బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (సుమారు రూ.10 లక్షల కోట్లు), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) సంక్షోభం, కుంగిన వ్యవసాయ వృద్ధి, గ్రామీణ ఆదాయాల క్షీణత... వంటివి కారకాలుగా నిలిచాయి. ‘భారత ఆర్థిక వ్యవస్థ అత్యవసర చికిత్స విభాగం (ఐసీయూ)లో ఉంది. ప్రస్తుతానికిది మందగమనానికి సంకేతమే తప్ప, మాంద్యం బారిన పడలే’దన్నది కొందరు ఆర్థికవేత్తల అంచనా. ఈ విషయంలో ఆందోళన అనవసరమన్న వాదనలూ లేకపోలేదు. ఏదేమైనా మరో ఏడాది గడిస్తే తప్ప పునరుద్ధరణకు గల అవకాశాల గురించి చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది.
నైపుణ్యాభివృద్ధి కీలకం
ప్రపంచ ఆర్థిక వేదిక ప్రస్తావించిన మొదటి సవాలు- నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన అంశం. 2017-18 ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదికలో ఉద్యోగితకు సంబంధించిన పలు అంశాలున్నాయి. ఈ వ్యవధిలో దేశ నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల అత్యధిక స్థాయితో 6.1 శాతానికి చేరింది. మహిళల్లో పని భాగస్వామ్య రేటు 2004-05లో 42 శాతం. అది 2017-18లో 22 శాతానికి తగ్గింది. ఇప్పటికీ అసంఘటిత రంగంలో 85 నుంచి 90 శాతం వరకు కార్మికులున్న నేపథ్యంలో ప్రభుత్వం సంఘటిత రంగాన్ని విస్తరించడంపై దృష్టి సారించాలి. అసంఘటిత రంగం ఉత్పాదకతనూ పెంచాలి. జనాభా పెరుగుదలవల్ల శ్రామిక శక్తికి పెద్ద సంఖ్యలో ప్రజలూ తోడవుతారు. వారికి విద్య, నైపుణ్యాల్ని అందజేసినప్పుడే తగిన ఉద్యోగాలు దక్కి ప్రయోజనాలు సమకూరుతాయి. ఈ ప్రయోజనాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటాయి. ఇక ఇతర దేశాల్లో 70 నుంచి 80 శాతం యువతకు అధికారికంగానే వృత్తి నైపుణ్య శిక్షణ అందుతోంది.
మనదేశంలో కేవలం 2.3 శాతం శ్రామికులకే ఆ తరహా శిక్షణ లభిస్తోందని నీతిఆయోగ్ చెప్పడం- దేశంలో నైపుణ్యాభివృద్ధి మందకొడితనానికి నిదర్శనం. భారత నైపుణ్యాభివృద్ధి రంగంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రైవేటు పరిశ్రమలు పెద్దయెత్తున భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలూ నైపుణ్యాభివృద్ధి మిషన్లను ఏర్పాటు చేశాయి. నైపుణ్య సాధనలో 17 కేంద్ర మంత్రిత్వ శాఖలు కార్యక్రమాల్ని చేపట్టాయి. ఒకవైపు ఇంత కృషి జరుగుతున్నా, వాటిని వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభావశీలంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. నైపుణ్యాభివృద్ధిలో చైనా అనుభవాల నుంచి భారత్ అనేక పాఠాలు నేర్చుకోగల వీలుంది. 1996లో చైనా తెచ్చిన వృత్తివిద్యాచట్టం ఆ దేశ సాంకేతిక, వృత్తివిద్య, శిక్షణ వ్యవస్థలో మైలురాయిగా నిలిచిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నైపుణ్య సంస్థలు, పరిశ్రమలపై నిర్దిష్ట బాధ్యతల్ని నిర్దేశించేలా భారత్‌లో నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ కోసం ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలి.
ఆదాయాలు, వేతనాల్లో మందగమనం
సామాజిక, ఆర్థిక సమ్మిళితాభివృద్ధి గ్రామీణ భారతానికి చేరడం రెండో సవాలు. ఏడాదిగా గ్రామీణ ఆదాయాలు, వేతనాల్లో మందగమనం కనిపిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాల్ని పూడ్చాల్సి ఉంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, అంతర్జాలం అందుబాటులోకి తేవడం, ఆర్థిక సమ్మిళితం విషయంలో ఈ అంతరాలు తగ్గాలి. మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం అయిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు ప్రకటించడం ముఖ్యమైన చర్య. ఈ నిధుల్ని వ్యయపరచే క్రమంలో ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై మరింతగా దృష్టి సారించడం మంచిది. కొన్నేళ్లుగా ప్రభుత్వం ఎల్పీజీ కనెక్షన్లతో వంటగ్యాస్‌ను అందుబాటులోకి తెచ్చే ఉజ్వల యోజన; విద్యుత్తును అందించే సౌభాగ్య యోజన, స్వచ్ఛభారత్ అభియాన్ వంటి కార్యక్రమాల ద్వారా సేవలు అందించింది. ఇవి బాధిత వర్గాలకు ముఖ్యంగా మహిళలకు ఎంతగానో తోడ్పడ్డాయి. 2022నాటికి ప్రతి కుటుంబానికీ విద్యుత్తు, వంటగ్యాస్ సౌకర్యం అందిస్తామని 2019 బడ్జెట్ వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో ఈ పథకాల పురోగతి తీరును గమనించాల్సి ఉంది.
పెచ్చరిల్లుతున్న వ్యాధులు