డబ్బు పొదుపు చేయాలని మనసులో ఉన్నా... ఎలాగో తెలియదు కొందరికి. దాంతో అవసరానికి మించి ఖర్చు చేస్తూ ఆ తర్వాత బాధపడతారు. మీరూ అలానే చేస్తుంటే...ఇది చదవండి.
పొదుపు గురించి తెలియకపోతే...ఎంత సంపాదించినా నిరుపయోగమే! ఖర్చుపెట్టేప్పుడు చిన్న మొత్తమే అనిపించొచ్చు కానీ నెల తిరిగేసరికి అమ్మో ఇంత ఖర్చు చేసేశామా అనిపిస్తుంది. అందుకే చిల్లర వాడుకున్నా సరే.. లెక్క రాయండి. అప్పుడు వృథాని గుర్తించి అడ్డుకట్ట వేయొచ్చు.
చాలామంది అమ్మాయిలు... ట్రెండ్‌లపై ఆసక్తి పెంచుకుని తరచూ ఏవో ఒకటి కొంటూనే ఉంటారు. సందర్భాన్ని బట్టి కొనుక్కుంటే... కొత్తదనం కనిపిస్తుంది. డబ్బులూ ఆదా అవుతాయి. ఒకవేళ ఏదైనా కొనాలనిపిస్తే... దానికి పెట్టాలనుకున్న మొత్తాన్ని తీసి పక్కన ఉంచండి. ఇలా నెల మొత్తంలో మీరు దాచిన డబ్బులతో... బంగారమో మరొక విలువైన దానిపైనో ఉపయోగించొచ్చు. ఇలా చేయడం వల్ల మీ మనసు మీ నియంత్రణలో ఉంటుంది.
చాలామంది తేలిగ్గా తీసుకుంటారు కానీ... సంపాదనలో కనీసం పది శాతమైనా పొదుపు కోసం పక్కన పెట్టే అలవాటు ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. అమ్మాయిలం ఆర్థిక లావాదేవీలతో మాకేం పని అనొద్దు. చిన్న మొత్తాలతో డబ్బులు భద్రపరుచుకోవడం మొదలుపెడితే... అవే మీకు అవసరానికి ఉపయోగపడతాయి. పొదుపు చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే... మరో ఖర్చుని తగ్గించుకునైనా ఇందుకోసం డబ్బు కేటాయిస్తే మేలు.
ఇదీ చూడండి: Covid: మూడో దశను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సిద్ధమేనా?