తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐ 'శక్తి'ని పరీక్షించనున్న 3 కీలక సవాళ్లివే.. - ఆర్బీఐ కొత్త గవర్నర్

మరో మూడేళ్లు ఆర్​బీఐ గవర్నర్​గా కొనసాగనున్న శక్తికాంత దాస్‌కు మూడు కీలక సవాళ్లు.. ఆయన శక్తికి పరీక్ష పెట్టనున్నాయి. కరోనా కష్టకాలం, పెద్దనోట్ల రద్దు వంటి పెద్ద ప్రమాదాలను తన చాకచక్యంతో నెట్టుకొచ్చిన దాస్​కు.. కీలక వడ్డీరేట్లపై నిర్ణయం, డిజిటల్‌ కరెన్సీ, బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్లు ప్రవేశం వంటివి అగ్నిపరీక్షగా మారనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

RBI Governor Shaktikanta Das
ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్‌

By

Published : Nov 1, 2021, 2:27 PM IST

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది. 2024 డిసెంబరు వరకు అంటే దాదాపు ఎన్‌డీఏ-2 పాలన ముగిసే వరకు ఆయనే ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆరేళ్ల పదవీకాలాన్ని పొందిన అయిదో గవర్నర్‌గా దాస్‌ గుర్తింపు పొందారు. ఈ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటే, ఆర్‌బీఐకి అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన రెండో గవర్నర్‌ అవుతారు.

ఆయన సమర్థతకు సాక్ష్యాలు..

పెద్దనోట్ల రద్దు సమయంలో కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తూ, అత్యంత సన్నిహితంగా పనిచేసినందుకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. కరోనా సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేలా చేయడం కోసం బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి భారీగా ద్రవ్యలభ్యత చేకూరేలా చేశారు. ఆర్థిక స్థిరత్వం, వృద్ధి కోసం దాస్‌ ఆధ్వర్యంలోని ఆర్‌బీఐ దాదాపు 100 చర్యలను ప్రకటించింది. గతేడాది మే నెలలో కీల రేటును రికార్డు కనిష్ఠ స్థాయి అయిన 4 శాతానికి చేర్చారు. వృద్ధికి ఊతమిచ్చేందుకు ఇప్పటికీ ఆ రేటునే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.12.60 లక్షల కోట్ల రుణ పథకం సజావుగా సాగేలా చేసినందునే ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో మూడేళ్ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు నెలకొన్న సంక్షోభాల్ని సమర్థంగా ఎదుర్కొన్న దాస్‌ మున్ముందు కీలక సవాళ్లు ఎదుర్కోనున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న ఈ సమయంలో ఆయన నిర్ణయాలు కీలకం కానున్నాయి. ఆయన ముందున్న మూడు కీలక సవాళ్లేంటో పరిశీలిద్దాం..!

సర్దుబాటుకు స్వస్తి..

ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు ఇప్పటి వరకు కీలక వడ్డీరేట్లను దాస్‌ స్థిరంగా కొనసాగిస్తూ వచ్చారు. పైగా అవసరమున్నంత వరకు ఇదే సర్దుబాటు వైఖరి కొనసాగుతుందని కూడా ఇటీవల తెలిపారు. అయితే, దీన్ని మరింత కాలం పొడిగించే అవకాశం ఏమాత్రం లేదని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయంగా స్వల్పకాల వడ్డీరేట్లు పెరుగుతున్నాయి. అనేక దేశాల కేంద్ర బ్యాంకులు నెలక్రితంతో పోలిస్తే ఆర్థిక విధానంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో సైతం సర్దుబాటు వైఖరికి స్వస్తి చెప్పకతప్పని పరిస్థితులు రావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే మూడేళ్ల పాటు వరుసగా వడ్డీరేట్లు పెంచాల్సిన అవసరమూ తలెత్తొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చమురు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాల్ని పెంచుతోంది. ఈ పరిమితుల మధ్య ద్రవ్య పరపతి విధానాన్ని దాస్‌ ఎలా కొనసాగిస్తారన్నది చూడాల్సి ఉంది!

డిజిటల్‌ ప్రపంచం..

ఆర్థిక వ్యవస్థలో డిజిటల్‌ హవా కొనసాగుతోంది. రుణాలు, బీమా ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయడంలో ఫిన్‌టెక్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులో ఇది మరింత ఊపందుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది బ్యాంకులకు ఒకరకంగా ముప్పుగానే పరిణమించింది. అయితే, వీటిపై నియంత్రణ కష్టంగా మారింది. ఇది ఆర్‌బీఐ ముందున్న పెద్ద సవాల్‌. ఈ సమయంలో పటిష్ఠ చర్యలు చేపట్టలేకపోతే.. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికే ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇదే క్రమంలో క్రిప్టోకరెన్సీపై కూడా ఆర్‌బీఐ ఏదోఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని నిషేధించాలా? నియంత్రించాలా? అన్నది పూర్తిగా ఆర్‌బీఐ చేతిలోనే ఉంది. ఒకవేళ నిషేధిస్తే.. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన లక్షలాది మంది పరిస్థితేంటి? సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ) తీసుకురావడానికి ఇదే సరైన సమయమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీనిపైనా ఆర్‌బీఐ దృష్టి సారించాల్సి ఉంది.

బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్లు..

ప్రైవేటు బ్యాంకుల్లోకి కార్పొరేట్లను అనుమతించాలంటూ రిజర్వు బ్యాంకు కార్యాచరణ బృందం చేసిన సిఫారసు దాస్‌ నేతృత్వంలోని ఆర్‌బీఐ ముందున్న మరో పెద్ద సవాల్‌. ఇది ఇప్పటికే పెద్ద దుమారం రేకెత్తించింది. భారీమొత్తం రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే కార్పొరేట్లకే బ్యాంకుల పగ్గాలు ఇస్తే ఎలా అని రఘురామ్‌ రాజన్‌, విరాల్‌ ఆచార్య వంటి దిగ్గజ బ్యాంకర్లు గతంలో ప్రశ్నించారు. అవసరం ఉన్నవారికి రుణాలు అందకపోవచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దీని అమలును దాస్‌ ఎలా చేపడతారనేది ఆసక్తిగా మారింది.

కరోనా కష్టకాలం, పెద్దనోట్ల రద్దు వంటి పెద్ద ప్రమాదాలను తనదైన పనితీరు, ప్రభుత్వ అండతో చాకచక్యంగా ఎదుర్కొన్న శక్తికాంత దాస్‌ శక్తికి ఈ మూడు కీలక సవాళ్లు పరీక్ష పెట్టనున్నాయి.

ఇదీ చూడండి:'వింటర్​ గ్యాడ్జెట్స్​'పై అమెజాన్​ సేల్​లో భారీ డిస్కౌంట్లు

ABOUT THE AUTHOR

...view details