కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తున్నప్పటికీ.. కొన్ని రంగాలు మాత్రం తమ సేవల్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. అందులో బ్యాంకింగ్ రంగం ఒకటి. బ్యాంకు ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ఉద్యోగులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు 'అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య' ప్రధాన కార్యదర్శి ఎస్.నాగరాజన్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు ఫ్రంట్‌లైన్ వర్కర్లని.. వారిని మహమ్మారి కబళిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో కరోనా భారీస్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లేదా పాక్షిక లాక్‌డౌన్లు విధించాయి. కానీ, అత్యవసర రంగంలో ఉన్న బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయి. 50 శాతం సిబ్బందితో పనిచేయడం, పనివేళల్లో కొన్ని సడలింపులు కల్పించినప్పటికీ.. సేవల్ని మాత్రం నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక మంది ఉద్యోగులు మహమ్మారి బారిన పడుతున్నారు.