Instant Personal Loan: అడిగి మరీ వెంటనే రుణం ఇస్తున్నారు కదా అని అవసరం లేకపోయినా రుణం తీసుకుంటున్న వారు ఎంతో మంది. వడ్డీ రేటు మాత్రమే విని, సరే అని చెప్పేవారు ఇందులో అధికం. కానీ, అంతకుమించి చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఏమాత్రం తేడా వచ్చినా భారం అధికంగా ఉంటుందన్న సంగతి విస్మరించకూడదు. వడ్డీ రేటుతోపాటు, ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఖర్చులూ రుణభారాన్ని పెంచుతాయి.
గుర్తింపు ఉందా?
మొబైల్ ఫోను చేతిలో ఉంటే చాలు.. రుణాలిచ్చే ఎన్నో ఫిన్‌టెక్ యాప్‌లు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా వీటిలో వేటికి ఆర్‌బీఐ అనుమతి ఉంది.. ఏవి బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నాయని తనిఖీ చేసుకోవాలి. గుర్తింపు లేని సంస్థల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు తీసుకోవద్దు. అనధికారంగా రుణాలిచ్చే సంస్థల నుంచి అప్పు తీసుకుంటే.. రుణగ్రహీతకు ఉండే ఏ హక్కులూ ఉండవు. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు.
చిన్న రుణాలతో..
తీసుకున్న అప్పును సకాలంలో తీర్చడం ఒక బాధ్యత. అయితే, తక్కువ వ్యవధికి తీసుకునే సూక్ష్మరుణాలకు వడ్డీ భారం అధికంగా ఉంటుంది. పైగా ఆ లోపు తీర్చకపోతే అధిక భారం పడుతుంది. కాబట్టి, రూ.20వేలకు మించిన రుణాన్ని 90 రోజులకు తక్కువ వ్యవధికి తీసుకోవద్దు. స్వల్పకాలంలో అధిక మొత్తాన్ని తీర్చడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. కొత్త రుణం తీసుకొని, పాత రుణాన్ని తీర్చడంలాంటివి చేస్తే అప్పుల ఊబిలో కూరుకుపోతాం.
అవసరం మేరకే..
కొన్నిసార్లు ఫిన్‌టెక్ సంస్థలు మనకు అధిక మొత్తంలో రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ, మన అవసరం ఎంత అనేదీ చూసుకోవాలి. ఇస్తున్నారు కదా అని అధిక మొత్తం తీసుకుంటే.. తర్వాత చెల్లించడం కష్టమవుతుందని మర్చిపోవద్దు. మీ అవసరం, తీర్చే సామర్థ్యం రెండూ బేరీజు వేసుకొని, ఎంత తీసుకోవాలన్నది నిర్ణయించుకోండి.
రుణం కోసం ఒకేసారి రెండు మూడు సంస్థలకు దరఖాస్తు చేయకూడదు. దీనివల్ల మీ రుణ అర్హతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అప్పు తీసుకునేటప్పుడు దరఖాస్తు పత్రంతోపాటు, రుణ ఒప్పందాన్నీ ఒకసారి పూర్తిగా పరిశీలించండి. నియమనిబంధనలు పూర్తిగా తెలుసుకున్నాకే ముందడుగు వేయండి.
ఇదీ చూడండి :మార్కెట్లోకి సిల్వర్ ఈటీఎఫ్‌లు.. మదుపు ఎలా చేయాలి ?