తెలంగాణ

telangana

ETV Bharat / business

హోం లోన్​ ట్రాన్స్​ఫర్​ చేయాలా? ఇవి తప్పనిసరి! - ఒక సంస్థ నుంచి మరో సంస్థకు గృహరుణ బదిలీ ఎలా చేయాలి?

Home Loan Transfer: సొంత ఇల్లు.. చాలామంది కల. దీన్ని నెరవేర్చుకునేందుకు గృహరుణం తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఇప్పటికే రుణం తీసుకున్న కొందరు.. అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. అటువంటివారు గృహరుణాన్ని ఒక సంస్థ నుంచి మరో దానికి బదిలీ చేయాలని యోచిస్తుంటారు. అయితే బదిలీ ఎప్పుడు చేయాలి? అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఓ సారి పరిశీలిద్దాం.

Home Loan
Home Loan

By

Published : Mar 11, 2022, 2:22 PM IST

Home Loan Transfer: సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే ఇంటి రుణమే మార్గం. బ్యాంకులు, గృహరుణ సంస్థలు ఇప్పుడు 6.40-6.60శాతం వడ్డీకే ఈ అప్పును ఇస్తున్నాయి. ఇది ఎంతోమందిని ఆకర్షిస్తోంది. అందుబాటు వడ్డీకి రుణం లభిస్తున్నప్పటికీ ఇప్పటికే రుణం తీసుకున్న కొందరు అధిక వడ్డీలను చెల్లిస్తున్నారు. అలాంటి వారు తమ రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటప్పుడు గమనించాల్సిన విషయాలేమిటో తెలుసుకుందాం.

గృహరుణాన్ని ఒక సంస్థ నుంచి మరో దానికి బదిలీ చేయడం వెనుక ప్రాథమిక లక్ష్యం వడ్డీ ఆదా. బ్యాంకులు/గృహరుణ సంస్థలు రుణగ్రహీతకు వడ్డీ రేటును నిర్ణయించడంలో ఎన్నో అంశాలను పరిశీలిస్తుంటాయి. ముఖ్యంగా రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరు వంటివి చూస్తాయి. రుణాన్ని బదిలీ చేసుకునేప్పుడు పరిశీలన, నిర్వహణ రుసుముల్లాంటివి ఉంటాయి. కొత్త రుణం మాదిరిగానే పత్రాలు సమర్పించాలి. డాక్యుమెంటేషన్‌ ఛార్జీలు, ఇతర ఖర్చులూ ఉంటాయి. ఇవన్నింటినీ లెక్కించి చూసుకోవాలి. రుణాన్ని బదిలీ చేసుకున్నప్పుడు వచ్చిన ప్రయోజనాలకన్నా ఇవి అధికంగా ఉంటే మీ నిర్ణయం మానుకోవాలి. బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేటప్పుడు ఓవర్‌డ్రాఫ్ట్‌లాంటి వెసులుబాట్లు ఉన్నాయా చూసుకోండి. కొత్త గృహరుణం ఖాతాకు అనుబంధంగా ఓవర్‌డ్రాఫ్ట్‌ ఖాతాను ప్రారంభించాలి. రుణగ్రహీత తన దగ్గరున్న మిగులు మొత్తాన్ని ఇందులో జమ చేస్తుండాలి. అవసరమైనప్పుడు ఇందులో నుంచి నగదును వెనక్కి తీసుకోవచ్చు. వడ్డీ రేటును లెక్కించేటప్పుడు ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని మినహాయించి, మిగతా మొత్తానికే వడ్డీ విధిస్తారు. దీనివల్ల దీర్ఘకాలంలో భారం తగ్గుతుంది.

కొత్తలోనే..

గృహరుణం తీసుకున్న కొన్నేళ్ల తర్వాత బదిలీ చేసుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి, రుణం తీసుకున్న ప్రారంభంలోనే అధిక వడ్డీ ఉన్న బ్యాంకు/సంస్థ నుంచి తక్కువ వడ్డీ ఉన్న చోటకు మారాలి. రుణం ప్రారంభంలోనే వడ్డీ భాగాన్ని వసూలు చేస్తుంటారు. కాలం గడుస్తున్న కొద్దీ అసలు భాగం తగ్గుతుంది. కొంతకాలం గడిచిన తర్వాత రుణాన్ని మార్చుకుంటే.. అప్పటికే మనం చాలా వడ్డీని చెల్లించి ఉంటాం. కొత్తగా మళ్లీ వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఇది రుణగ్రహీతకు ఎంతో భారం. ఇప్పటికే కొనసాగుతున్న రుణం వ్యవధి, కొత్తగా తీసుకుంటున్న రుణ వ్యవధి రెండూ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడున్న రుణ వ్యవధి 20 ఏళ్లు. ఇప్పటికే మీరు రెండేళ్లపాటు చెల్లించారనుకుందాం.. మిగిలిన 18 ఏళ్ల వ్యవధినే రుణాన్ని బదిలీ చేసుకునేటప్పుడు పెట్టుకోవాలి. ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవాలంటే గడువు పెంచుకోవచ్చు. కానీ, వడ్డీ భారం అందుకు తగ్గట్టుగా ఉంటుందని మర్చిపోవద్దు.

టాపప్‌ కావాలనుకుంటే..

"ఇప్పటికే కొనసాగుతున్న ఇంటి రుణంపై టాపప్‌ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. నిర్ణీత కాలం క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించినప్పుడు రుణ సంస్థలు దీనిని అందిస్తుంటాయి. ఈ రుణానికి వడ్డీ రేటు గృహరుణానికి సమానంగానే ఉంటుంది. కొన్నిసార్లు కాస్త అధికంగా ఉంటుంది. మీకు నిజంగా టాపప్‌ రుణం అవసరం ఉందనుకుందాం.. ఇప్పటికే రుణం తీసుకున్న సంస్థ దీన్ని ఇవ్వకపోతే.. కొత్త సంస్థకు రుణాన్ని బదిలీ చేసుకోవడంతోపాటు, ఒకే రుణంగా పెద్ద మొత్తాన్ని తీసుకోవచ్చు."

- రతన్‌ చౌదరి, హెడ్‌ ఆఫ్‌ హామ్‌ లోన్స్‌, పైసాబజార్‌.కామ్‌

ఇదీ చూడండి:రాబడి హామీ పాలసీలు లాభమేనా?

ABOUT THE AUTHOR

...view details