పెళ్లికి రూ.కోట్లల్లో ఖర్చు చేయడం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఇదే ధనవంతుల్లో కొంత మంది తమ వివాహ బంధాన్ని తెంచుకునేందుకు (విడాకుల కోసం) భారీ మొత్తంలో చెల్లించుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి.
బిల్‌గేట్స్- మెలిందా
తమ 27ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌గేట్స్, మెలిందా సోమవారం ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవటం ఒక్కసారిగా అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
2000 సంవత్సరంలో స్థాపించిన బిల్-మెలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు వారు 53 బిలియన్ డాలర్లను సేవా కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ప్రస్తుతం బిల్‌గేట్స్ వయసు 65 ఏళ్లు, మెలిందా వయసు 56 ఏళ్లు. మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి బిల్‌గేట్స్ సీఈఓగా ఉన్న సమయంలో మెలిందా ప్రొడక్ట్ మేనేజరుగా చేరారు. అప్పట్లో కంపెనీలో చేరిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో ఏకైక మహిళ ఆమె. ఆ తర్వాత 1994లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
అయితే వీరి విడాకులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా మారనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెలిందాకు బిల్ ఇచ్చే భరణం విలువ విలువ దాదాపు 127 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది.
ఇప్పటికే పూర్తయిన అత్యంత ఖరీదైన విడాకుల ఇవే..
జెఫ్ బెజోస్-మెకాంజీ స్కాట్..
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్-మెకాంజీ స్కాట్ 2019లో విడాకులు తీసుకున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ఇవే అత్యంత ఖరీదైన విడాకులు. బెజోస్ ఆస్తిలో దాదాపు 38 బిలియన్ డాలర్లు మెకాంజీకి విడాకుల సమయంలో భరణంగా చెల్లించారు బెజోస్. ఫలితంగా ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళల్లో మెకాంజీ మూడో స్థానంలో నిలిచారు.
38 బిలియన్ డాలర్లు ఇచ్చినప్పటికీ.. జెఫ్ బెజోస్ ఆస్తిపై పెద్దగా ప్రభావం పడలేదు. కొంతకాలానికే రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆస్తి విలువ 196 బిలియన్ డాలర్లు అని అంచనా.