తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ విషయంలోనూ చైనా తర్వాతే అమెరికా

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేయడానికి భౌతిక దూరమే ఔషధమని అంటున్నారు వైద్యులు. కానీ, లాక్​డౌన్​ సమయంలో ప్రజలు నిత్యవసర దుకాణాల్లో ఎగబడటం వల్ల ఈ జాగ్రత్య చర్యను పాటించడం కష్టమవుతోంది. ఈ సమస్యను అధిగిమించడానికి ఈ-వాణిజ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఈ పక్రియను పాటించడంలో చైనా మినహా మిగిత దేశాలు విఫలం మవుతున్నాయి.

The world countries failng in the following of E-market, which is used to prevent the Corona Virus
కరోనా కాలంలో ఈ-వాణిజ్యం

By

Published : Apr 8, 2020, 7:44 AM IST

సమర్థమైన ఔషధ చికిత్స లేదా వ్యాక్సిన్‌ లభ్యమయ్యే వరకు కొవిడ్‌ 19 వ్యాధి అదుపునకు పరస్పరం భద్రమైన దూరం పాటించడమే శరణ్యం. కానీ, లాక్‌డౌన్‌ సమయంలో జనం సూపర్‌ మార్కెట్లకు, కిరాణా దుకాణాలకు ఎగబడటంవల్ల దూరం పాటించడం కష్టమవుతోంది. ఈ సమస్యను నివారించడానికి ఆన్‌లైన్‌ కొనుగోళ్లు ఎంతో అక్కరకొస్తాయి. కరోనా వైరస్‌ విజృంభణవల్ల చైనాలో 76 కోట్లమంది గృహ నిర్బంధంలో ఉండాల్సి వచ్చినా తమకు కావలసిన సరకులను ఆన్‌లైన్‌లో ఆర్డరు పెట్టి, 20 నిమిషాల్లోనే ఇంటి వద్ద అందుకోగలిగేవారు. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతలకు ఉద్భవ స్థలమైన అమెరికా ఈ విషయంలో చైనాను అందుకోలేక సతమతమవుతోంది. కరోనా సంక్షోభానికి చాలాముందే చైనా ఈ-కామర్స్‌లో ప్రపంచ అగ్రగామి అయింది. ఈ ఏడాది అంతర్జాలం ద్వారా, బయటి దుకాణాల ద్వారా జరిగిన చిల్లర అమ్మకాల్లో అమెరికాను మించిపోయింది. మొబైల్‌ చెల్లింపులతో సువిశాల డిజిటల్‌ చిల్లర విపణిని సుసాధ్యం చేసుకొంది. 2019లో అమెరికాలో జరిగిన మొత్తం అమ్మకాల్లో ఈ-కామర్స్‌ ద్వారా జరిగినవి కేవలం 11 శాతం. సెలవు రోజుల్లోనైతే ఈ ఆన్‌లైన్‌ అమ్మకాలు గరిష్ఠంగా 14.6 శాతానికి చేరతాయని మాస్టర్‌ కార్డు సంస్థ గణాంకాలు తెలిపాయి. అదే చైనాలోనైతే 35.3 శాతం చిల్లర అమ్మకాలు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యధిక రేటు. 2022 సంవత్సరానికి అమెరికాలో ఆన్‌లైన్‌ చిల్లర అమ్మకాలు 15 శాతానికి పరిమితమైతే, చైనాలో ఈ తరహా అమ్మకాలు 63 శాతాన్ని మించుతాయని ‘ఈ మార్కెటర్‌’ సంస్థ అంచనా.

రోబోల వినియోగం

కరోనా వల్ల పౌరులు ఇంటిపట్టునే ఉండి ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జరుపుతున్నందున అమెరికాలో 34 శాతం చిల్లర దుకాణాలు మూతపడిన సంగతి ఇక్కడ గమనించాలి. చైనా ఈ కామర్స్‌ కంపెనీలు అనేక బాలారిష్టాలను దాటుకుని ఆన్‌లైన్‌ మార్కెట్‌లో అపార పరిణతి సాధించాయి. ఖాతాదారులు కరోనా సంక్షోభానికి చాలా ముందు నుంచే ఈ కామర్స్‌ యాప్స్‌ వాడుతున్నారు. సంక్షోభ సమయంలో బట్వాడా కుర్రాళ్లు సరకులను ఖాతాదారు ఇంటి ముంగిట లేదా అక్కడ ఏర్పాటు చేసిన పెట్టెలో వదలివెళుతున్నారు. ఏదైనా రెస్టారెంట్‌కు ఆహార పదార్థాల కోసం ఆర్డరు పెడితే- రెస్టారెంట్‌ యాజమాన్యాలు తమ బట్వాడా కుర్రాళ్ల శరీర ఉష్ణోగ్రతను ముందుగానే నమోదు చేసి డెలివరీ యాప్‌ల ద్వారా ఖాతాదారులకు తెలియజేస్తున్నాయి. చైనాలోని ఈ కామర్స్‌, ఆహార డెలివరీ సంస్థలు స్వయంచాలిత గిడ్డంగులను, బట్వాడా డ్రోన్లను, మానవ రహిత డెలివరీ రోబోలను ఉపయోగించి ఖాతాదారులకు సరకులు పంపుతున్నాయి. ఈ విధంగా నిర్వహణ ఖర్చులు తగ్గించుకొంటూ, సిబ్బంది కొరత వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఖాతాదారులు నిష్పూచీగా సరకులు స్వీకరించే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

విపణికి స్మార్ట్​ఫోన్​ వంతెన

చైనాలో అలీబాబా, జేడీ వంటి సంస్థలు ఆన్‌లైన్‌తోపాటు, బహిరంగ విపణిలో గిడ్డంగులు, బట్వాడా కేంద్రాలు, విక్రయశాలలను ఏర్పాటు చేసి ఖాతాదారులకు వేగంగా సరకులు అందిస్తున్నాయి. చైనాలో ఈ కామర్స్‌ విజృంభణ స్మార్ట్‌ ఫోన్ల వల్లనే సాధ్యపడింది. 81శాతం అమెరికన్ల చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు ఉన్నా అక్కడ ఇప్పటికీ డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులదే రాజ్యం. కార్డు చెల్లింపుల ద్వారా వస్తుసేవలు స్వీకరిస్తే విక్రయదారుల నుంచి దండిగా రివార్డు పాయింట్లు, బహుమతులు లభిస్తున్నందున ఖాతాదారులు మొబైల్‌ చెల్లింపులకు మారడం లేదు. అదే చైనాలో ఖాతాదారులు గతేడాది 80శాతం చెల్లింపులను మొబైల్‌ యాప్‌ల ద్వారానే జరిపారు. కరెన్సీ నోట్లతో కాకుండా మొబైల్‌లో ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిపినట్లయితే, వ్యాపారులు లెక్కల్లో చూపకుండా క్రయవిక్రయాలు జరపడం సాధ్యపడదు. దీనివల్ల ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరుగుతుంది. అందుకే భారత ప్రభుత్వం మొబైల్‌ చెల్లింపుల ద్వారా డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. చైనాలో ప్రభుత్వం కన్నా అలీబాబా, టెన్సెంట్‌ వంటి టెక్‌ దిగ్గజాల ద్వారానే డిజిటల్‌ లావాదేవీలు విజృంభించాయి. మొత్తం మీద మొబైల్‌ చెల్లింపుల్లో చైనా, భారత్‌లకన్నా అమెరికా వెనుకబడిపోయింది. కరోనా సంక్షోభం డిజిటల్‌ ఇండియాకు కొత్తఊపు తీసుకురానుంది.

చైనాపాటి చెయ్యలేక అమెరికా అవస్థలపాలు

చైనా ఈ కామర్స్‌, సరకుల బట్వాడా విషయంలో అమెరికా, ఐరోపా దేశాలకన్నా నాలుగైదేళ్లు ముందుంది. కరోనా సంక్షోభంలో కూడా చైనా సంస్థలు తమ ఖాతాదారులకు కొరత లేకుండా వేగంగా సరకులు బట్వాడా చేయగా, అమెరికాలో వాల్‌మార్ట్‌, కాస్ట్‌కో తదితర సూపర్‌ మార్కెట్లు, అమెజాన్‌వంటి ఈ కామర్స్‌ కంపెనీలు ఆ పని చేయలేకపోతున్నాయి. భౌతిక దూరం పాటింపు, లాక్‌డౌన్‌ వంటివి ఎన్ని నెలలు కొనసాగుతాయో తెలియక ప్రజలు ఈ కామర్స్‌ సైట్లకు ఎడాపెడా ఆర్డర్లు పెట్టేస్తున్నారు. సూపర్‌ మార్కెట్లకు ఎగబడుతున్నారు. ఈ మార్కెట్లలో ఖాళీ అరలు వెక్కిరిస్తూ ఉంటే, అమెజాన్‌ సకాలంలో సరకులు సరఫరా చేయలేకపోతోంది. చేతిని శుభ్రపరచుకోవడానికి శానిటైజర్లు, టాయిలెట్‌ పేపర్లు, గృహాన్ని శుభ్రంగా ఉంచే సామగ్రి కోసం కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్న ఆర్డర్లను ఈ కామర్స్‌ కంపెనీలే కాదు, సూపర్‌ మార్కెట్లూ నెరవేర్చలేకపోతున్నాయి. ప్రాన్స్‌, ఇటలీలలోనైతే శానిటైజర్లు, టాయిలెట్‌ పేపర్లు సరఫరా చేయలేనని అమెజాన్‌ చేతులెత్తేసింది. అటు సూపర్‌ మార్కెట్లలో, ఇటు ఈ కామర్స్‌ సైట్లలో వస్తువులు దొరక్క వృద్ధులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ కామర్స్‌, సూపర్‌ మార్కెట్‌ సిబ్బందిలో ఎవరైనా కోవిడ్‌ 19 బారినపడినా, లేక వారి కుటుంబ సభ్యులకు సోకి వారి బాగోగులు చూసుకోవడానికి సిబ్బంది సెలవు పెట్టినా ఖాతాదారులకు సరకులు బట్వాడా చేయడం మరింత కష్టమవుతుంది. ఈ అవాంతరాన్ని ఎదుర్కోవడానికి అమెజాన్‌ లక్షమందినీ, వాల్‌ మార్ట్‌ లక్షన్నరమందినీ కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. మిగతా కంపెనీలూ వేల సంఖ్యలో నియామకాలు జరుపుతున్నాయి. కరోనా కల్లోలంవల్ల ఉద్యోగాలు కోల్పోయిన రెస్టారెంట్‌, చిల్లర విక్రయాల సిబ్బందినీ ఈ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details