రాష్ట్రాల ఆదాయం ఈ ఏడాది బాగుంటుంది. పన్నుల రాబడి, ముఖ్యంగా ఇంధనంపై వేసిన పన్నుల(Fuel tax) వసూలు ప్రవాహంలా ఉండనుండడం ఇందుకు ప్రధాన కారణం. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు పెరగనుండడం మరో కారణం. దాంతో ఆదాయాలు కరోనా(Corona)కు ముందున్న పరిస్థితికి చేరుకునే అవకాశం ఉంది. అదీ కొవిడ్ మూడో(Covid Third Wave) ఉద్ధృతి లేకుండా ఉంటేనే అన్నది ఇందులోని షరతు. గురువారం క్రిసిల్ సంస్థ విడుదల చేసిన అంచనాల నివేదికలో ఈ విషయం వెల్లడయింది. రాష్ట్రాల ఆదాయంలో 10 శాతం మేర పెట్రోలు(Petrol), డీజిల్‌పై వసూలు చేసిన పన్నులే ఉంటాయి. గత ఏడాది ఈ ఆదాయంలో 20 శాతం మేర పెరుగుదల కనిపించింది. అయితే అధిక ధరల కారణంగా ఈ ఏడాది 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగే సూచనలు ఉన్నాయి. పది పెద్ద రాష్ట్రాలైన... మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కేరళల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం క్రిసిల్ సంస్థ ఈ నిర్ణయానికి వచ్చింది.
పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు
సాధారణంగా రాష్ట్ర ఆదాయాల్లో 25% మేర కేంద్ర పన్నుల్లో వాటా, 21% రాష్ట్రాల జీఎస్టీ, 17 శాతం కేంద్ర గ్రాంట్లు, 13% పెట్రోలు, ఆల్కహాల్‌పై పన్నులు ఉంటాయి. ఇవి కాకుండా ఎక్సైజ్ డ్యూటీ, స్టాంపు డ్యూటీ ఇతరత్రా కూడా ఆదాయం సమకూరుతుంది. చాలా చోట్ల లీటరు పెట్రోలు ధర రూ.100కు దాటినప్పటికీ వాటిపై పన్నుల భారం తగ్గించే సూచనలు కనిపించడం లేదు. ఇంధనం వినియోగం 2-3% మేర తగ్గినప్పటికీ ఆదాయం పడిపోయే అవకాశాలు లేవు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను సడలిస్తుండడంతో ఆగస్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలు పూర్తిస్థాయిలో జరగనున్నాయి. దాంతో ప్రభుత్వాల ఆదాయం పెరగనుంది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంచనాల కన్నా ఆదాయం సుమారు 17 శాతం తక్కువగా ఉండనుంది. కరోనా రెండో దశ ఉద్ధృతిని పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ అంచనాలను రూపొందించాయి. ఆ కారణంగా వాటి లెక్కలకు అనుగుణంగా వాస్తవ రెవెన్యూ ఉండే అవకాశం లేదు.
ఇదీ చూడండి:రిమోట్ పార్కింగ్ ఫీచర్‌తో బీఎండబ్ల్యూ కొత్త కారు