తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫండ్లలో పెట్టుబడి ఉపసంహరణకు సరైన సమయం ఏది? - మ్యూచువల్ ఫండ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చాలా మంది మ్యూచువల్‌ ఫండ్ల విషయంలో సరైన ప్రణాళికలు పాటించినప్పటికీ.. వాటి నుంచి పెట్టుబడులు ఎప్పుడు ఉపసంహరించుకోవాలనే విషయంలో సందిగ్ధంలో ఉంటారు. అన్ని సార్లు ఫండ్ల నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అలాంటప్పుడు పెట్టుబడి విషయంలో అప్రమత్తత అవసరం. మరి మ్యూచువల్ ఫండ్ల నుంచి ఎలాంటి సందర్భాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How to be vigilant when it comes to mutual funds
మ్యూచువల్ ఫండ్ల విషయంలో అప్రమత్తంగా ఎలా ఉండాలి

By

Published : May 14, 2021, 3:05 PM IST

మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేటప్పుడు తప్పనిసరిగా దీర్ఘకాలిక లక్ష్యం ఉండాలి. ఫండ్లను ఎంచుకుని, పెట్టుబడిని ప్రారంభించినప్పుడే.. సరైన పథకాలను ఎంచుకోవాలి. నిర్ణీత కాలానికి వాటిని సమీక్షించడం తప్పనిసరి. కొన్నిసార్లు మదుపు చేస్తున్న ఫండ్‌ సరైన రాబడిని ఇవ్వకపోవచ్చు. మన నిర్ణయం తప్పుకాదనీ, కొంతకాలం తర్వాత అన్నీ సర్దుకుంటాయని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఇది ఎంతమాత్రం సరికాదు. మన కష్టార్జితాన్ని ఆ ఫండ్‌ మరింత కరగదీయకముందే.. దాని నుంచి నిర్మొహమాటంగా బయటపడాలి. అవి ఎలాంటి సందర్భాల్లోనో చూద్దాం.

ఆశించిన రాబడి రాకపోవడం

ముందే అనుకున్నట్లు మ్యూచువల్‌ ఫండ్లు దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలు. స్వల్పకాలంలో వచ్చే హెచ్చుతగ్గులను పెద్దగా పట్టించుకోకూడదు. కానీ.. ఐదారేళ్లు గడిచేసరికి ఆ పథకం అన్ని రకాల మార్కెట్‌ దశలనూ చూసి ఉంటుంది. అప్పుడూ దాని ప్రామాణిక విభాగంతో పోలిస్తే సగటు రాబడిని అందించాలి. అంతేకాకుండా అదే తరహా పెట్టుబడి వ్యూహం ఉన్న పథకాలకు సమానంగా లాభాల్ని పంచాలి. ఇలాంటి పనితీరు లేకుంటే.. నిర్మొహమాటంగా ఆ ఫండ్‌ యూనిట్లను విక్రయించడమే శ్రేయస్కరం.

ఫండ్‌ మేనేజర్‌ నిష్క్రమణ

యాక్టివ్‌ పెట్టుబడి విధానంలో ఫండ్‌ మేనేజర్‌ ఎంతో కీలకంగా వ్యవహరిస్తారు. కొన్నిసార్లు ఫండ్‌ సంస్థ ఆ మేనేజర్‌ను ఇతర ఫండ్లకు బదిలీ చేయడం, లేదా అతను సంస్థను వీడటంలాంటివి జరుగుతుంటాయి. దీనివల్ల పెట్టుబడులకు ఏ ఇబ్బందీ రాదని ఫండ్‌ సంస్థలు ప్రకటిస్తుంటాయి. కానీ, అతని వ్యూహాల వల్ల లాభాలు సంపాదించిన ఫండ్‌.. ఆ తర్వాత రాబడి ఆర్జించలేకపోతుంటే కచ్చితంగా పెట్టుబడి కొనసాగించడం గురించి ఆలోచించాల్సిందే.

నిర్వహణలో ఉన్న ఆస్తులు పెరగడం

ఒక ఫండ్‌ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం)నూ చూస్తుండాలి. ఏయూఎం పెరిగిన కొద్దీ... వాటిని నిర్వహించడం కొన్నిసార్లు ఫండ్‌ మేనేజర్‌కు కష్టం కావచ్చు. ముఖ్యంగా స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో అధిక ఏయూఎం ఉన్నప్పుడు ఆ ఫండ్‌లో తక్కువ లిక్విడిటీకి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒకేసారి షేర్లను అమ్మినప్పుడు వాటి ధర తగ్గి, ఫండ్‌ రాబడిపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, ఒక దశకు మించి ఏయూఎం పెరిగితే.. ఆ ఫండ్‌ నుంచి కొత్త ఫండ్‌లోకి మారడం మంచిది.

పెట్టుబడి వ్యూహాల్లో మార్పు

కొన్నిసార్లు ఒక ఫండ్‌ పథకంలో విలీనం అవుతుంది. లేదా ఫండ్‌ సంస్థలూ మరో సంస్థ చేతిలోకి వెళ్లిపోతుంటాయి. సెబీ నిబంధనల ప్రకారం ఒక ఫండ్‌ సంస్థ నుంచి ఒక విభాగంలో.. ఒకే ఫండ్‌ ఉండాలి. కాబట్టి, అవి ఆ పథకాల వ్యూహాన్ని మార్చే అవకాశం ఉంది. ఉదాహరణకు వాల్యూ ఓరియెంటెడ్‌ ఫండ్‌.. గ్రోత్‌ ఓరియంటెడ్‌గా మారొచ్చు. ఇలాంటప్పుడూ.. అప్పటికే ఉన్న పోర్ట్‌ఫోలియో ఆధారంగా ఆయా ఫండ్లలో కొనసాగే విషయాన్ని ఆలోచించుకోవాలి. మీరు అనుకుంటున్న లక్ష్యానికి ఆ ఫండ్‌ సరిపోదు అనుకున్నప్పుడూ పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు.

ఖర్చుల నిష్పత్తి పెరిగితే

బెంచ్‌మార్క్‌ రాబడితో సమానంగా కొనసాగేందుకు ఫండ్‌ సంస్థలు కొన్నిసార్లు ఖర్చుల నిష్పత్తిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి. ఇలా కాకుండా ఖర్చుల నిష్పత్తిని పెంచితే మాత్రం.. ఆ ఫండ్‌ గురించి సమయానుకూల నిర్ణయం తీసుకోవాలి.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details