దేశీయ రోడ్డు రవాణా రంగంలో ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థల వల్ల పెనుమార్పులు సంభవించాయి. పదులు, వందల సంఖ్యలో బస్సులు నిర్వహించే ప్రైవేటు ఆపరేటర్లతో పాటు 1-2 బస్సుల యజమానులకూ సమాన అవకాశాలు లభించాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వరంగ రవాణా సంస్థలు (ఆర్టీసీ) కూడా ఆన్‌లైన్ బాట పట్టేందుకు ఇవే కారణమయ్యాయంటే అతిశయోక్తి కాదు. రద్దీకి తగినట్లు బస్సు సర్వీసులు అకస్మాత్తుగా పెంచినా, అన్నీ ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడం వల్ల పారదర్శకంగా బుక్ చేసుకునే అవకాశం ప్రజలకు దక్కేది. రద్దీ లేనపుడు భారీ రాయితీలను రెడ్‌బస్, అభిబస్ వంటి సంస్థలు వెబ్‌సైట్లు, యాప్‌లతో పోటాపోటీగా ఆఫర్ చేసేవి. సినీస్టార్లతో భారీ ప్రకటనలూ ఇచ్చేవి.
రెడ్‌బస్ సంస్థను మేక్‌మైట్రిప్ కొనుగోలు చేసి, కొనసాగిస్తోంది. కొవిడ్ వల్ల మార్చి చివరివారం నుంచి మే వరకు బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఆంక్షలతో అరకొరగా నడుస్తున్నాయి. ఆన్‌లైన్‌లో బుకింగ్ ద్వారా మాత్రమే ఈ బస్సు సర్వీసుల్లో ప్రయాణించే వీలుంది. అయితే ప్రయాణికుల సంఖ్య 20-30 శాతం కూడా ఉండటం లేదని సమాచారం. ఈ వెబ్‌సైట్ల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్ లింక్ ద్వారా రైళ్ల టికెట్లు కొనుగోలు చేసే వీలుంది. రాజధాని రైళ్లు కూడా నడుస్తున్నా, వాటిల్లోనూ ప్రయాణానికి పెద్దగా సుముఖత చూపడం లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
- హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అభిబస్‌లో అయితే గతంలో రోజూ రూ.2 కోట్ల విలువైన టికెట్లు విక్రయించేవారు. ఇప్పుడు రూ.10 లక్షలకు మించడంలేదని విశ్వసనీయ సమాచారం. టికెట్లపై లభించే 10 శాతం వరకు కమీషన్‌తోనే టికెటింగ్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అంటే రోజుకు రూ.20 లక్షల వరకు రావాల్సిన ఆదాయం రూ.లక్షకు పడిపోయిందన్న మాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీలకు ఈ సంస్థే టికెటింగ్ సాఫ్ట్‌వేర్‌నూ నిర్వహిస్తోంది. అయినా కూడా వ్యయాలు భరించలేక 200 మంది ఉద్యోగుల్లో 100 మందిని తొలగించారు. మిగిలిన వారిలో రూ.20,000లోపు వేతనం కలిగిన ఉద్యోగులకు మినహా, అధిక వేతనం కలిగిన వారికి 25-50 శాతం కోత విధిస్తోంది.
- రెడ్‌బస్‌ను నిర్వహిస్తున్న మేక్‌మైట్రిప్ అయితే 3,500 మందిలో 1300 మంది వరకు తొలగించినట్లు సమాచారం. అక్కడా వేతన కోతలు అమలవుతున్నాయని తెలిసింది. దేశీయ విమానయాన సంస్థలు 45 శాతం వరకు సర్వీసులు నిర్వహించే వీలున్నా, ప్రయాణికులు తక్కువగా ఉంటున్నందున, సంస్థలు పెంచడంలేదు. విమాన టికెట్లతో పాటు హోటల్ బుకింగ్ సేవలపై కొద్దిపాటి ఆదాయమే మేక్‌మైట్రిప్, క్లియర్‌ట్రిప్ వంటి సంస్థలకు వస్తోంది.
- హోటళ్ల నుంచి ఆహార పదార్థాలు తెప్పించుకునే వీలున్నా, అత్యధిక వినియోగదార్లు దూరంగానే ఉంటున్నారు. ఫలితంగా స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల్లోనూ 30-50 శాతం ఉద్యోగ తొలగింపులు, వేతన కోతలు అమలవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇంటికే మద్యం సరఫరాకు కాంట్రాక్టులు పొందేందుకు ప్రయత్నిస్తూ, వ్యాపారం పెంచుకునేందుకు చూస్తున్నాయి.
- సినిమా టికెట్లతో పాటు ఇతర సాంస్కృతిక ప్రదర్శనల టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో విక్రయించే బుక్‌మైషో ఆదాయం ఒక త్రైమాసికం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 600 మంది ఉద్యోగుల్లో 300 మందిని తొలగించినట్లు సమాచారం.
- ఓలా, ఉబర్ క్యాబ్‌లకూ గిరాకీ తగ్గిపోవడం వల్ల ఆయా సంస్థలూ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాయి.
సర్వర్ ఖర్చుల నుంచి ఊరట