తెలంగాణ

telangana

ETV Bharat / business

జోరు జోరుగా పాత బంగారం మార్పిడి - exchange of old gold is increasing.,

పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.40,000కు చేరువ కావడంతో, దేశీయంగా కొనుగోళ్లు భారీగా తగ్గడంతో పాటు పాత బంగారం మార్పిడి పెరుగుతోంది. సమీప భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగుతుందని, పసిడి దిగుమతులు కూడా తగ్గుతున్నాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది.

జోరు జోరుగా పాత బంగారం మార్పిడి

By

Published : Nov 6, 2019, 8:16 AM IST

పసిడి ధరలు పెరుగుతున్న కారణంగా.. పాత బంగారం మార్పిడి పెరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలో 123.9 టన్నుల పసిడికే గిరాకీ లభించిందని, గతేడాది ఇదే కాల గిరాకీ 183.2 టన్నులతో పోలిస్తే, ఈసారి 32 శాతం క్షీణించిందని ప్రపంచ స్వర్ణ మండలి వివరించింది. ఇదే సమయంలో పుత్తడి దిగుమతులు 236.8 టన్నుల నుంచి 66 శాతం తగ్గి, 80.5 టన్నులకే పరిమితం అయ్యాయి. అధిక ధరలకు తోడు ఆర్థిక మందగమన ప్రభావమే ఇందుకు కారణమని విశ్లేషించింది. ఆభరణాల విక్రేతలు కూడా గతంలో దిగుమతి చేసుకుని, నిల్వ చేసుకున్న బంగారంతో పాటు పాత ఆభరణాల మార్పిడి (ఎక్స్ఛేంజ్‌)ని వినియోగించుకున్నారని తెలిపింది.

తొలి 9 నెలల్లో..

ఈ ఏడాది జనవరి-సెప్టెంబరులో 496.11 టన్నుల పసిడికి దేశీయంగా గిరాకీ లభించింది. 2018 ఇదే కాలంలో 523.9 టన్నులకు, ఆ ఏడాది మొత్తంమీద 760.4 టన్నుల పసిడికి గిరాకీ లభించిందని తెలిపింది.

ఇదే సమయంలో పసిడి దిగుమతులు కూడా 587.3 టన్నుల నుంచి 502.9 టన్నులకు తగ్గాయి. 2018 మొత్తంమీద దేశంలోకి 755.7 టన్నుల పసిడి దిగుమతైంది. ధరలు అధికంగా ఉన్నందున, పాత బంగారం మార్పిడి పెరిగింది. 2018 మొత్తంమీద 87 టన్నుల పాత బంగారం మార్చుకోగా, ఈ ఏడాది 9 నెలల్లోనే ఈ మొత్తం 90.5 టన్నులకు చేరింది.

అకస్మాత్తుగా ధర 20 శాతం పెరగడం వల్లే..

‘జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య బంగారం ధర అకస్మాత్తుగా 20 శాతం పెరగడం దేశీయంగా గిరాకీ తగ్గేందుకు ప్రధాన కారణమైంది. భారత్‌, చైనా సహా ప్రపంచదేశాలు ఆర్థిక మందగమనంలో చిక్కుకున్నందున, కొనుగోలుదారుల సెంటిమెంటు దెబ్బతినడమూ ప్రభావం చూపింది’ అని డబ్ల్యూజీసీ భారత మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరం పేర్కొన్నారు. 2017 మార్చి త్రైమాసికం నుంచి దేశీయ గిరాకీ కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. ఇలా పేరుకున్న బంగారం నిల్వలు 200-220 టన్నుల మేర ఉండొచ్చని, మందగమనం- అధిక ధరల నేపథ్యంలో, ఈ నిల్వలు తగ్గించుకునేందుకు వ్యాపారులు ప్రయత్నించారని తెలిపారు.

రాయితీ ధరలకు విక్రయించారు

‘జులై-సెప్టెంబరులో అమ్మకాలు బాగా తగ్గినందున, విక్రేతలు గతంలో దిగుమతి చేసుకున్న బంగారాన్ని, రాయితీపై అమ్మారు. ఒక దశలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారాన్ని అప్పటి ట్రేడింగ్‌ ధర కంటే 45 డాలర్లకే విక్రయించారు. దీపావళి వచ్చేసరికి ఈ రాయితీ ఔన్సుకు 2 డాలర్లకు పరిమితమైంది’ అని సోమసుందరం తెలిపారు. ధన త్రయోదశి, దీపావళి సమయంలో గిరాకీ కాస్త మెరుగుపడినా, గతేడాదితో పోలిస్తే, తక్కువగానే ఉందన్నారు.

దిగుమతుల భారం తగ్గుతుంది

‘బంగారానికి అధిక ధరలు కొనసాగుతాయి. అయితే ఈ ధరలకు వినియోగదారులు అలవాటు పడేందుకు అధిక సమయం పడుతుంది. గ్రామీణ అనిశ్చితి వల్ల కొనుగోలుదార్ల సెంటిమెంటు బాగా ఏమీ పెరగదు. వివాహాల కోసం కొనుగోళ్లు కూడా గతేడాది కంటే తక్కువే జరుగుతాయి. ఇందువల్ల పూర్తి ఏడాదికి దేశీయ గిరాకీ అంచనాలను 750-800 టన్నుల నుంచి 700-750 టన్నులకు తగ్గించాం. ఇందులోనూ 700 టన్నులకే పరిమితం కావచ్చు. 2016లోనూ గిరాకీ 665 టన్నులే కావడం గమనార్హం. అధిక ధరల వల్ల పాత బంగారం మార్పిడి పెరిగి, దిగుమతులు దిగి వస్తాయి’ అని సోమసుందరం వివరించారు.

జులై-సెప్టెంబరులో ప్రపంచ వ్యాపంగా 1107.9 టన్నుల పసిడికి గిరాకీ ఏర్పడింది. 2018 ఇదే కాలంలో ఈ మొత్తం 1079 టన్నులే. భారత్‌-చైనాల్లో కొనుగోళ్లు తగ్గినా, ఈ పరిస్థితి ఏర్పడటం గమనార్హం.

ఇదీ చూడండి : యాపిల్ బంపర్​ ఆఫర్- ఐఫోన్ కొనడం చాలా సులభం!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details