ఒక త్రైమాసికం నుంచి మరో త్రైమాసికానికి వృద్ధి రేటు క్రమక్రమంగా దిగజారుతున్న తరుణంలో 2019 డిసెంబర్ 31న కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యల నిమిత్తం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఐదేళ్లలో మౌలిక రంగంలో 102.51 ట్రిలియన్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు వెల్లడించింది. మార్చి 2020కి ముందు మూడు ఆర్థిక సంవత్సరాలలో జీడీపీ వృద్ధి తగ్గుతూ వస్తున్నందున ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. 2016-17లో 8.2 శాతంగా ఉన్న వాస్తవ వృద్ధి రేటు క్రమక్రమంగా పడిపోయింది. 2017-18 లో 7.2 శాతం, 2018-19 లో 6.8 శాతానికి దిగజారింది. కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిలో 1.8 శాతం కోత పడింది. కేవలం 5 శాతంగానే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉందనడంలో సందేహం లేదు. ఆర్థిక మందగమనంపై పోరాడటానికి ప్రభుత్వం మౌలిక రంగంపై దృష్టిసారించింది. రోడ్లు, విద్యుత్, ఇళ్ల నిర్మాణం, నీటి పారుదల వంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. అయితే 2025 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది ప్రకటించిన ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి ఈ చర్యలు సరిపోవు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పెట్టుబడులు, వృద్ధి, ఉద్యోగాలు పెరుగుతాయా అన్నది ప్రశ్నార్థకం.
మౌలిక రంగమే వేగు చుక్క
ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజా మౌలిక సదుపాయల్లో పెట్టుబడులు పెట్టడం అన్నది చాలా దేశాల్లో సాధారణమైన విషయం. ఉదహరణకు అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడి దక్షిణ కొరియా గతేడాది కోలుకోలేని నష్టం చవిచూసింది. తద్వారా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి మందగమనంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పన సహా ప్రైవేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ప్రజా మౌలిక సదుపాయాల కల్పనలో 51 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించారు. అటువంటి ప్రభుత్వ పెట్టుబడులు కొత్త డిమాండ్ అవకాశాలను పెంచి, ప్రైవేట్ సంస్థలను ఆకర్షిస్తాయనడంలో సంశయం లేదు. కీనేసియన్ ఆర్థిక సిద్ధాంతం ప్రకారం ఆర్థిక కార్యకలాపాలకు నూతనోత్తేజం తేవడం సహా మొత్తం డిమాండ్‌ని పెంచడానికి ఈ పెట్టుబడులు ఉపకరిస్తాయి.
భారత్ దృక్పథం ప్రశ్నార్థకం
అయితే వృద్ధి 11 ఏళ్ల కనిష్ఠానికి పడిపోవడం సహా భవిష్యత్ దృక్పథం ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో భారత్ తన మౌలిక రంగ పెట్టుబడులలో ఉన్న లోపాలను గుర్తించాల్సి ఉంటుంది. వృద్ధి రేటు అత్యంత కనిష్ఠ స్థాయికి దిగజారిందా? లేదంటే మరింత పతనమయ్యే పరిణామాలు ఉన్నాయా అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లేవు.
వచ్చే ఐదేళ్లలో మౌలిక రంగాల్లో పెట్టుబడులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మౌలిక రంగంలో ఉన్న రూ.6.2 ట్రిలియన్ల పెట్టుబడులను వచ్చే ఏడాది రూ.19.5 మిలియన్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. 2021-22లో రూ.19 మిలియన్లు, ఆ తర్వాత 2024-25 నాటికి వరుసగా మూడేళ్లలో రూ.13.5, రూ.12.5, రూ.11 ట్రిలియన్లను పెట్టుబడులుగా పెట్టడానికి ప్రణాళికలు రచించింది.
ఇందులో 80 శాతాన్ని రోడ్లు, రైల్వే, విద్యుత్, నీటి పారుదల, గృహ నిర్మాణం వంటి రంగాల్లోనే ఖర్చు చేయనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 78 శాతం రిస్క్‌ని సమానంగా భరించనుండగా ప్రైవేటు భాగస్వాములు 22 శాతం నష్టాన్ని భరిస్తాయి. 2020-25 నాటికి రూపొందించడానికి అనువైన ప్రాజెక్టల జాబితాను ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ జాతీయ మౌలిక పైప్‌లైన్(ఎన్ఐపీ)రూపొందించింది. అందులో కొన్ని ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి.
గత వ్యయాల ఫలితమేంటి?
అయితే గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన వ్యయాలతో పోలిస్తే తాజా పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ఊతమిస్తాయి? మోదీ అధికారంలోకి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం రోడ్లు, రహదారులు, ఇళ్లు, పట్టణాలు, డిజిటల్ మౌలిక రంగాల్లో పెద్ద ఎత్తునే పెట్టుబడులు పెట్టింది. ఎన్ఐపీ గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2017-18లో తన వ్యయాలను రూ.3.9 ట్రిలియన్లకు పెంచుకుంది. ఇది అంతకుముందుతో పోలిస్తే 2.3 రెట్లు ఎక్కువ. జీడీపీతో పోలిస్తే ఇది 1.4 శాతం నుంచి 2.3 శాతానికి పెరిగింది. 2018-19లో మౌలికంపై కేంద్రం చేసిన ఖర్చు రూ.3.8 ట్రిలియన్లు. దీంతోపాటు ఎన్ఐపీ ప్రకారం వచ్చే ఏడాది రూ.4.6 ట్రిలియన్లను ఖర్చు చేయడానికి సిద్ధమైంది. మరోవైపు మొత్తం ఎన్ఐపీ పెట్టుబడులలో 24 శాతం(19.5 ట్రిలియన్ల) పెట్టుబడులను 2020-21 సంవత్సరానికి కేటాయించింది. వచ్చే రెండేళ్లలో కేంద్రం చేసే వ్యయాలు అంతకుముందుతో పోలిస్తే కేవలం రూ.1 ట్రిలియన్ ఎక్కువ. మరోవైపు తొలి మూడేళ్లలో రాష్ట్రాలు ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. 2024,2025 ఆర్థిక సంవత్సరాలలో కేంద్రం తన పెట్టుబడుల శాతాన్ని పెంచనుంది.