లాక్‌డౌన్ ఆంక్షల ఎత్తివేత అనంతరం భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభమైనా.. మూడో త్రైమాసికం (అక్టోబరు- డిసెంబరు) నుంచి ఆ ఒరవడి నెమ్మదిస్తుందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసింది. ఆసియాలోనే అత్యంత నెమ్మదిగా పుంజుకునే ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తికి ముందున్న వృద్ధి స్థాయిలను అందుకోవడానికి దిగ్గజ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఆర్థిక వ్యవస్థే ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. 'ఇండియా: ఏ రీఓపెనింగ్ గాన్ రాంగ్' పేరుతో రూపొందించిన నివేదికలో పై విషయాలను ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ వెల్లడించింది. ఆర్థికవ్యవస్థ మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల ప్రభావం జూన్‌లో ఉన్నా, ఇప్పుడు కనిపించడం లేదని తెలిపింది. 'మూడో త్రైమాసికం తర్వాత నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం నెమ్మదించవచ్చని మా ప్రాథమిక అంచనా.
ఆర్థికవ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు చేపట్టిన చర్యల ప్రభావం తగ్గుముఖం పట్టడం, కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం, విధానపరమైన సహకారం తగినంతగా లేకపోవడం, ఆర్థిక వ్యవస్థకు సాధారణంగా ఎదురయ్యే సవాళ్లు లాంటివి ఇందుకు దోహదం చేస్తాయ'ని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ తన నివేదికలో వెల్లడించింది. కరోనా కేసుల నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరిస్తున్న విధానాలు కూడా ఇందుకు మరో కారణంగా తెలిపింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత, ప్రారంభంలో కలిసొచ్చే సానుకూలతల ప్రభావం జూన్ వరకే ఉంటుంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం వల్ల ఎగుమతులు కొంతమేర పుంజుకుంటున్నాయి. తదుపరి పరిస్థితులు ఆందోళనకరంగా ఉండొచ్చు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇప్పటికే అవరోధాలు ఎదురవుతున్నాయని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అభిప్రాయపడింది. జూన్ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా కొత్తగా కరోనా హాట్‌స్పాట్‌లు పెరిగాయని తెలిపింది. దిల్లీ మినహా మిగిలిన ఏ ప్రధాన ప్రాంతం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో పెద్దగా విజయవంతం కాలేదని పేర్కొంది. మళ్లీ కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలు విధించేందుకు అవకాశాలున్నప్పటికీ.. మొదటి దశ లాక్‌డౌన్ స్థాయిలో ఉండకపోవచ్చని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలో ఇప్పటివరకు కీలక పాత్ర పోషించిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ.. మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షలు విధించినా పెద్దగా ప్రభావానికి లోనుకాకపోవచ్చని తెలిపింది.