తెలంగాణ

telangana

ETV Bharat / business

చిరుసంస్థలపై ఉరుము లేని పిడుగు - రిటైల్‌

కొత్తగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల పరిధిలోకి రిటైల్‌, టోకు వ్యాపారాల్ని చేర్చడం వల్ల బ్యాంకులు వాటివైపే మొగ్గు చూపే అవకాశాలు అధికమంటున్నారు నిపుణులు. అదే జరిగితే తమ శ్రేణిలోకి కొత్తవాటి చేరికవల్ల పరిమిత నిధులకూ నోచని దుస్థితి లఘు పరిశ్రమల్ని మరింతగా కుంగదీస్తుంది. రాష్ట్రాలవారీగా లక్షల సంఖ్యలో చిరుసంస్థలు పూర్తిగా మూతపడే ముప్పు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు ఉరుములేని పిడుగులా ఈ కొత్త విపత్తు దాపురించింది.

retail and wholesale businesses merge
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ

By

Published : Jul 6, 2021, 7:27 AM IST

ఇంకో మూడేళ్లలో దేశీయ రిటైల్‌ రంగం రూ.95 లక్షల కోట్ల స్థాయికి విస్తరిస్తుందన్న అంచనాలు ఆమధ్య వెలుగుచూసినా- వాస్తవంలో అందుకు భిన్నమైన స్థితిగతులు కళ్లకు కడుతున్నాయి. కొవిడ్‌ రక్కసి కోరసాచి ఇతర రంగాలతోపాటు చిల్లర వర్తకాన్నీ కాటేసింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా రిటైల్‌ రంగాన్ని, టోకు వాణిజ్యాన్ని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)ల పరిధిలోకి చేరుస్తూ కేంద్రప్రభుత్వం కొత్తగా విధాన నిర్ణయం తీసుకుంది. తద్వారా రిజర్వ్‌బ్యాంక్‌ మార్గదర్శకాల్ని అనుసరించి వాటికి ప్రాధాన్యరంగ రుణాలు సమకూరతాయని ప్రధానమంత్రి, అమాత్యులు భరోసా ఇస్తున్నారు. రూ.250 కోట్లవరకు వార్షిక టర్నోవరు కలిగిన చిల్లర, టోకు వర్తకుల్లో రెండున్నర కోట్లమంది దాకా ప్రయోజనం పొందగలరన్నది అధికారిక వివరణ. తనవంతుగా అఖిలభారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) లబ్ధిదారుల సంఖ్య ఎనిమిది కోట్ల మేర ఉండనుందని ఆశావహ చిత్రాన్ని ఆవిష్కరిస్తోంది!

ఉపశమనం కలిగిస్తుందా..

2017 జూన్‌ వరకు రిటైల్‌, హోల్‌సేల్‌ వ్యాపారాలు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల పరిధిలోనే ఉండేవి. అప్పట్లో చిల్లర, టోకు వ్యాపారాలన్నవి తయారీ, సేవా విభాగాల పద్దులోకి రావంటూ వాటిని ఆ జాబితానుంచి తొలగించారు. వాటి స్వరూప స్వభావాల్లో ఇప్పటికీ గుణాత్మక పరివర్తన లేకపోయినా, కొన్నాళ్లుగా పరిణామాల దృష్ట్యా ప్రభుత్వ వైఖరి మారినట్లు కనిపిస్తోంది. నిరుడు లాక్‌డౌన్‌ ఆరంభమైన తొలి వంద రోజుల్లోనే చిల్లర వర్తకరంగం ఎకాయెకి రూ.15.5 లక్షల కోట్ల మేర నష్టపోయిందని సీఏఐటీ మదింపు వేసింది. ఇటీవలి కొవిడ్‌ ఆంక్షల పర్యవసానంగా మొన్న ఏప్రిల్‌ నెలలోనే రిటైల్‌, టోకు వ్యాపారాలకు సుమారు రూ.6.25 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్న అంచనాలు సంక్షుభిత వాతావరణానికి అద్దం పట్టాయి. మునుపటి నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం తిరగదోడటం- చిల్లర, టోకు వర్తకులకు ఏ పాటి ఉపశమనం కలిగిస్తుందో చూడాలి!

చిరుసంస్థలకు ముప్పు..

దేశంలో అసలు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగం ఎలా ఉంది? పరిమిత పెట్టుబడులతో స్వయం ఉపాధికి బాటలు పరవడంలో, విస్తృత ఉత్పాదనలతో దేశార్థికాన్ని ఉత్తేజపరచడంలో ముందుండే ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు అక్షరాలా ఏటికి ఎదురీదుతున్నాయి. రిజర్వ్‌ బ్యాంకే ఆ యథార్థాన్ని ధ్రువీకరించినా- వాటి తలరాత మెరుగుపడనే లేదు. ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన తరవాతా లఘు పరిశ్రమలకు మంచిరోజులు ఎండమావులనే తలపిస్తున్నాయి. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల రంగానికి నికరంగా రూ.45 లక్షల కోట్ల దాకా నిధులు అవసరమని విశ్లేషణలు చాటుతుండగా, బ్యాంకులు సమకూరుస్తున్నవి 18శాతం లోపేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రుణ పరిమితుల్ని షరతుల్ని సాకల్యంగా ప్రక్షాళించకుండా- లఘు పరిశ్రమలు పొందగోరే రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వజూపుతున్నా, క్షేత్రస్థాయిలో నికర సాంత్వన కొల్లబోతోంది. 'కొల్లేటరల్‌ సెక్యూరిటీ'తో ప్రమేయం లేకుండా అదనపు రుణం మంజూరు చేయాల్సిన బ్యాంకులు అందుకు వెనకాడుతుండటం- 'ఉద్దీపన' స్ఫూర్తికే తూట్లు పొడుస్తోంది. కొత్తగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల పరిధిలోకి రిటైల్‌, టోకు వ్యాపారాల్ని చేర్చడం వల్ల బ్యాంకులు వాటివైపే మొగ్గుచూపించే అవకాశాలు అధికమంటున్నారు. అదే జరిగితే తమ శ్రేణిలోకి కొత్తవాటి చేరికవల్ల పరిమిత నిధులకూ నోచని దుస్థితి లఘు పరిశ్రమల్ని మరింతగా కుంగదీస్తుంది. రాష్ట్రాలవారీగా లక్షల సంఖ్యలో చిరుసంస్థలు పూర్తిగా మూతపడే ముప్పు ఎదుర్కొంటుండగా ఇప్పుడు ఉరుములేని పిడుగులా ఈ కొత్త విపత్తు దాపురించింది. ఇటు చిల్లర, టోకు వ్యాపారాల్ని అటు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని నిజంగా ఆదుకోవడమన్నది- కేవలం రుణ హామీలతోనే సాధ్యమయ్యే పని కాదు. ఉద్దీపన ప్యాకేజీలతో లఘుపరిశ్రమలకు ప్రయోజనం అంతంతమాత్రమేనని రుజువవుతున్నవేళ, ఆ జాబితా విస్తరణతో అదనపు లబ్ధి ఎవరికి ఎలా చేకూరుతుంది? కోట్ల మందికి ప్రాధాన్య ప్రాతిపదికన రుణవసతి దస్త్రాలకే పరిమితం కానివ్వకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటేనే- ప్రభుత్వ ప్రవచిత సత్సంకల్పం నీరోడకుండా ఉంటుంది!

ఇదీ చదవండి:2021లో పెరిగిన ప్రభుత్వ వ్యయం!

కరోనా దెబ్బ- ఏడాది కనిష్ఠానికి సేవా రంగం!

ABOUT THE AUTHOR

...view details