'ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాని సృష్టించాలి. కోట్లానుకోట్లు సంపాదించాలి. ప్రపంచవ్యాప్తంగా మన పేరు మారుమోగాలి' ఇలాంటి కోరికలు మనలో చాలా మందికి ఉండే ఉంటాయి. కానీ, వాటిని నిజం చేసుకోవడం మాత్రం అందరి వల్ల కాదు! అది.. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, మార్క్ జుకర్‌బర్గ్, స్టీవ్‌జాబ్స్, బిల్‌గేట్స్, రతన్ టాటా వంటి వారికి మాత్రమే సాధ్యం.
అయితే.. 'వారికే ఎందుకు సాధ్యమైంది? మన వల్ల ఎందుకు కాదు' అని ఆలోచిస్తే.. 'వాళ్లదేముంది బార్న్ విత్ సిల్వర్ స్ఫూన్ అంటారు. అడిగితే కొండ మీద కోతినైనా తెచ్చిచ్చే కుటుంబం ఉండి ఉంటుంది.' అని అనుకుంటాం. కానీ, అది ఏ మాత్రం నిజం కాదు! ఈ బిలియనీర్లు కూడా ఒకప్పుడు మనలా చిరుద్యోగాలు చేస్తూ.. డబ్బులను పొదుపు చేస్తూ ఖర్చు చేసినవారే! అయితే అనుకున్నది సాధించడంపై తమకు ఉన్న అంకితభావం, చిన్న వయసులో తమ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ద్వారా వీరు ఉన్నత స్థానానికి చేరుకోగలిగారు. బిలియనీర్లుగా మారారు. ఇంతకీ వీరంతా తమ ఉద్యోగ జీవితాన్ని ఎలా మొదలుపెట్టారో ఇప్పుడు చూద్దాం..
ఎలాన్ మస్క్: ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' అధిపతిగా.. స్పేస్ ఎక్స్ సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఆయనే కాదు.. ఆయన చేసే ఓ చిన్న ట్వీట్ కూడా వేలాది కోట్లు సంపదను నియంత్రించగలదు. అంతటి వ్యక్తి ఒకప్పుడు కంప్యూటర్ గేమ్‌లను అమ్మేవాడంటే నమ్మగలరా? కానీ అదే నిజం. 1983లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన మస్క్.. ఇంటింటికి తిరిగి కంప్యూటర్ గేమ్‌లను విక్రయించేవారు. దాని ద్వారా ఆయన నెలకు 500 డాలర్లు, అంటే రూ.37,405ను జీతంగా పొందేవారు. దక్షిణాఫ్రికాలో పెరిగిన ఆయన.. తన 17 ఏళ్ల వయసులో కెనడాకు వలస వచ్చారు. అప్పుడే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు.
జెఫ్ బెజోస్:ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ అధిపతి, ప్రపంచంలోనే రెండో కుబేరుడైన జెఫ్ బెజోస్.. తన కెరీర్‌ను మెక్‌డొనాల్డ్స్ సంస్థలో బర్గర్లు అమ్మే పనితో ప్రారంభించారు. 16 ఏళ్ల వయసులో ఆ సంస్థలో పని చేసిన ఆయన.. గంటకు రూ.201ని జీతంగా పొందేవారు.
వారెన్ బఫెట్: ఈ అమెరికా వ్యాపార దిగ్గజం.. ఒకప్పుడు 'పేపర్ బాయ్‌గా పని చేశారం'టే.. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. అదే నిజం. 1994లో ఆయన 'వాషింగ్టన్ పోస్ట్' పత్రికను ఇంటింటికి తిరుగుతూ విక్రయించేవారు. ఈ పని చేయడం వల్ల ఆయనకు నెలకు 175 డాలర్లు(రూ.13,091) జీతంగా వచ్చేది.