భారత విమానయాన చరిత్రలో తొలిసారి ఓ మహిళా అధికారి దేశీయ విమానయాన సంస్థ పగ్గాలు చేపట్టనున్నారు. ఎయిర్ ఇండియా(ఏఐ) ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన అలయన్స్ ఎయిర్‌కు కెప్టెన్ హర్‌ప్రీత్ సింగ్‌ను సీఈవోగా నియమిస్తూ ఎయిర్ ఇండియా సీఎండీ రాజీవ్ భన్సల్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈమె ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం హర్‌ప్రీత్ సింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ సేఫ్టీ విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె స్థానాన్ని కెప్టెన్ నివేదితా భాసిన్ భర్తీ చేయనున్నారు.
దేశంలో తొలి మహిళా పైలట్..
ఎయిర్ ఇండియాకు ఎంపికైన తొలి మహిళా పైలట్ హర్‌ప్రీత్ సింగే కావడం విశేషం. కానీ.. ఆరోగ్య సమస్యల వల్ల పైలట్‌గా కాకుండా.. ఫ్లైట్ సెఫ్టీ విభాగంలో చేరారు. ఇక్కడ ఆమె విశేష సేవలందించారు. ‘ఇండియన్ ఉమెన్ పైలట్ అసోసియేషన్’కు హెడ్‌గానూ ఆమె పనిచేశారు. దేశీయ విమానయాన సంస్థల్లో అత్యధిక మంది మహిళా పైలట్లు ఉన్నది ఎయిర్ ఇండియాలోనే. 1980, 2005లో అత్యధిక మంది మహిళలు పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. 2005 నుంచి ప్రైవేట్ సంస్థలు అందుబాటు ధరల్లో విమనాలు నడపడం ప్రారంభించాయి.