తెలంగాణ

telangana

ETV Bharat / business

కోరుకున్న‌ది చేరుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఆర్థిక‌ ల‌క్ష్యం - ఒక వ్య‌క్తి జీవితంలో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ చాలా అవ‌స‌రం. భ‌విష్య‌త్తు కోసం ఆలోచ‌నతో కూడిన‌ ఆర్థిక ప్ర‌ణాళిక ఉండాలి

ఒక వ్య‌క్తి జీవితంలో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ చాలా అవ‌స‌రం. భ‌విష్య‌త్తు కోసం ఆలోచ‌నతో కూడిన‌ ఆర్థిక ప్ర‌ణాళిక ఉండాలి. ప్ర‌ణాళిక అనుస‌రించి త‌మ‌ ఆర్థిక ల‌క్ష్యం చేరుకోవాలి. ఈ క‌థ‌నంలో ఆర్థిక ల‌క్ష్యం అంటే ఏంటి? వాటిని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

finance
కోరుకున్న‌ది చేరుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఆర్థిక‌ ల‌క్ష్యం

By

Published : Jan 2, 2020, 7:01 AM IST

సాధార‌ణంగా మ‌న‌కు భ‌విష్య‌త్తులో అవ‌స‌రాలు, ల‌క్ష్యాలు, కోరిక‌లు ఉంటాయి. వాటిని నెర‌వేర్చుకునేందుకు డ‌బ్బు అవ‌స‌రం ఉంటుంది. అలా డ‌బ్బుతో ముడిప‌డి ఉన్న వాటిని ఆర్థిక ల‌క్ష్యంగా పేర్కొంటారు. ముఖ్యంగా మ‌దుప‌ర్ల‌కు త‌మ ఆర్థిక ల‌క్ష్యంపై స్ప‌ష్ట‌త ఉండాలి. ఒక ఆర్థిక ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్న‌పుడు దాన్ని సాధించేందుకు కావ‌ల్సిన మొత్తం, ప‌ట్టే కాలం త‌దిత‌రాల‌ను ముందుగా అంచ‌నా వేయాలి. ఫ‌లానా ల‌క్ష్యం నెర‌వేరేందుకు ఇన్ని సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డి చేయాల‌ని… లేదా ఇన్ని నెల‌లు మ‌దుపుచేయాల‌ని అంచ‌నా వేసుకోవాలి.

సాధార‌ణంగా 3 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి పైన ఉండే వాటిని దీర్ఘ‌కాల ల‌క్ష్యాలుగానూ… 2-3 ఏళ్ల వ్య‌వ‌ధి క‌లిగే వాటిని మ‌ధ్య‌కాల ల‌క్ష్యాలుగా పేర్కొంటారు. స్వ‌ల్ప‌కాల ల‌క్ష్యాలు ఏడాది లోపు కాల‌వ్య‌వ‌ధి క‌లిగి ఉండేవి. ఈ మూడు ర‌కాల‌ ఆర్థిక‌ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు వేర్వేరు వ్యూహాలు అవ‌స‌రం. స్వ‌ల్ప‌కాలంలో అవ‌లంబించే వ్యూహం దీర్ఘ‌కాలంలో ప‌నిచేయ‌క పోవ‌చ్చు. దీర్ఘకాల వ్యూహం మ‌ధ్య‌కాల ఆర్థిక ల‌క్ష్యాల‌కు స‌రిపోవ‌క‌వ‌చ్చు. దీనికి ఏయే విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాల‌నేది ఇప్పుడు చూద్దాం. స్వ‌ల్ప‌ ఆర్థిక ల‌క్ష్యాలు - త‌క్కువ స‌మ‌యంలో నెర‌వేరే అవ‌కాశం ఉండే ఆర్థిక ల‌క్ష్యాల‌ను స్వ‌ల్పకాల ఆర్థిక ల‌క్ష్యాలు అంటాం. వీటి కాల‌వ్య‌వ‌ధి ఏడాదిలోపు ఉంటుంది. స్వ‌ల్ప‌కాలం పాటు మ‌దుపుచేసే విధంగా ప్ర‌ణాళిక వేసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌: గాడ్జెట్ కొనుగోలు లేదా అత్య‌వ‌స‌ర నిధి. వ్యూహం - స్వల్పకాలిక లక్ష్యానికి ప్రధాన పెట్టుబ‌డిగా స్థిరత్వం క‌లిగిన డెట్ ప‌థ‌కాల‌ను ఎంచుకుని మిగిలిన మొత్తం ఈక్విటీలో పెట్టుబ‌డి చేయాలి. సిప్ ద్వారా డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయ‌డం మంచి ప‌ద్ధ‌తి. మ‌ధ్యకాల వ్య‌వ‌ధి ఆర్థిక ల‌క్ష్యాలు - సాధార‌ణంగా వీటి వ్య‌వ‌ధి 2-3 ఏళ్ల మ‌ధ్య ఉంటుంది.

స్వ‌ల్ప‌కాల ల‌క్ష్యాల‌తో పోలిస్తే వీటికి కొంత ఎక్కువ కాల‌వ్య‌వ‌ధి ఉంటుంది. కాబ‌ట్టి స్థిరాదాయ‌ ప‌థ‌కాల‌తో పాటు కొంత మొత్తం ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డుల్లో మ‌దుపుచేయ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌: కారు కొనుగోలు, విదేశీ ప‌ర్య‌ట‌నను చెప్ప‌వ‌చ్చు. వ్యూహం - ఇందులో కొంత ఈక్విటీ పాళ్లు పెంచ‌వ‌చ్చు. అలా అని షేర్ల‌లో నేరుగా చేయ‌డం కంటే బ్యాలెన్స్డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు, డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల ను క‌లిపి మిశ్ర‌మ పెట్టుబ‌డి వ్యూహాన్ని అనుస‌రించాలి.

దీర్ఘ‌కాలిక ఆర్థిక ల‌క్ష్యాలు - ఈ ల‌క్ష్యాల‌ను చేరుకునేందు ఎక్కువ‌కాలం మ‌దుపు చేయాల్సిఉంటుంది. కాబ‌ట్టి వీటికి దీర్ఘ‌కాలం పెట్టుబ‌డి చేసే వ్యూహం, ప్ర‌ణాళిక‌ అవ‌స‌రం అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌: దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు పిల్ల‌ల కాలేజీ విద్య‌, ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత జీవ‌నానికి స‌రిపోయే విధంగా నిధి ఏర్పాటు చేసుకోవ‌డం. మొద‌లైన వాటిని ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. వ్యూహం - దీర్ఘ‌కాలంలో ఈక్విటీ పై పెట్టుబ‌డి మంచి రాబ‌డిని ఇస్తుంద‌ని గ‌త చ‌రిత్ర తెలుపుతుంది. కాబ‌ట్టి దీర్ఘకాలిక ల‌క్ష్యాల‌కు ఈక్విటీని ప్రధాన పెట్టుబ‌డిగా చేసుకుని స్థిరాదాయ ప‌థ‌కాల్లో కొంత‌(డెట్ ) కొంత పెట్టుబ‌డి చేయాలి.

చివ‌ర‌గా…

ఈ క‌థ‌నంలో వివ‌రాలు క్లుప్తంగా వివ‌రించాం. మ‌దుప‌ర్లు ఆర్థిక ల‌క్ష్యం చేరుకునేందుకు వ్యూహాలు అమ‌లుచేసేట‌పుడు ఆర్థిక స‌ల‌హాదారుల‌ స‌ల‌హా తీసుకోవ‌డం సూచ‌నీయం. మ‌దుప‌ర్లు ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు అనుస‌రించే పెట్టుబ‌డి కేటాయింపు విధానాల‌ను త‌రువాతి క‌థానాల్లో తెలుసుకుందాం.

ఇదీ చూడండి : 'న్యూఇయర్​ కానుకగా రైల్ ఛార్జీలు, గ్యాస్​ ధరల పెంపు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details