ఈ భూమిపై జరిగే అతిపెద్ద పోటీల్లో ఒలింపిక్స్ ఒకటి. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ క్రీడా కుంభమేళా నిర్వహణకు అనేక నగరాలు పోటీ పడుతుంటాయి. దాదాపు ఒక దశాబ్దం ముందే వేదికలు ఖరారైపోతాయి. మరి ఇంతటి భారీ కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు ఎవరు భరిస్తారు? ఒలింపిక్స్ నిర్వహణ ఆర్థికంగా లాభమా? నష్టమా?
1970ల తర్వాత మారిన పరిస్థితులు
తొలినాళ్లలో ఒలింపిక్స్ నిర్వహణకు పెద్ద ఖర్చేమీ అయ్యేది కాదు. ఆటల నిర్వహణకు తగిన వసతులు ఉన్న ధనిక దేశాలే ఒలింపిక్స్‌కు వేదికలుగా ఉండేవి. ఐరోపా, అమెరికా దేశాల్లోనే ఈ క్రీడోత్సవాలు ఎక్కువగా జరిగేవి. అయితే, 1970 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని 'ఒలింపిక్స్-ఆర్థిక స్థితిగతుల'పై విస్తృత అధ్యయనం జరిపిన ఆండ్రూ జింబాలిస్ట్ తెలిపారు. అప్పట్లో టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు ఉండేవి కాదు. దీంతో క్రీడల నిర్వహణ సాదాసీదాగానే జరిగేది. టీవీలు అందుబాటులోకి రావడంతో ఒలింపిక్స్‌కు ఆదరణ పెరిగింది. హంగు ఆర్భాటాలూ ఎక్కువైపోయాయి. బ్రాడ్‌కాస్టర్లు, మార్కెటింగ్, స్పాన్సర్లు ఇలా ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఒలింపిక్స్ ఓ బ్రాండింగ్ ఈవెంట్‌లా మారిపోయింది. పైగా ఏటా క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. ఆటలు, వాటిలోని విభాగాల సంఖ్య సైతం పెరుగుతూ వస్తోంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది.
ఖర్చు రూ.30 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు
ఒలింపిక్స్ నిర్వహణకు కావాల్సిన సదుపాయాలన్నీ సిద్ధం చేస్తామని ఆయా నగరాలు బిడ్డింగ్ సమయంలోనే అంగీకరించాల్సి ఉంటుంది. అలా బిడ్డింగ్ గెల్చుకోవడం నుంచే ఖర్చు మొదలవుతుంది. 2016 ఒలింపిక్స్ నిర్వహణ బిడ్డింగ్‌ను గెల్చుకోవడం కోసం జపాన్ దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి విఫలమైంది. తాజా ఒలింపిక్స్ నిర్వహణ కోసం దాంట్లో సగం ఖర్చుపెట్టాల్సి వచ్చింది. బిడ్డింగ్ గెల్చిన తర్వాత ఆయా నగరాలకు దాదాపు పదేళ్ల సమయం ఉంటుంది. ఈ కాలంలో ఆటగాళ్లు, వీక్షకుల సంఖ్యను అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. రోడ్లు, రైళ్లు, విమాన మార్గాలు, భవనాలు, వంతెనలు, క్రీడా ప్రాంగణాలు, మైదానాలు నిర్మించాలి. కనీసం 40 వేల హోటల్ గదులను సిద్ధం చేయాలన్నది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) సూచన. దీంతో 2016 రియో ఒలింపిక్స్ కోసం బ్రెజిల్ అదనంగా 15 వేల కొత్త హోటల్ గదులను నిర్మించాల్సి వచ్చింది. సాధారణంగా ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఆయా నగరాల్లో అప్పటికే ఉన్న మౌలిక వసతులను బట్టి రూ.30 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు. 2014లో సోచిలో జరిగిన శీతాకాల ఒలింపిక్స్ నిర్వహణకు రష్యా 50 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా.. అందులో 85 శాతం క్రీడేతర మౌలిక వసతుల కల్పనకే వినియోగించింది. ఇక 2008 బీజింగ్ ఒలింపిక్స్ నిర్వహణకు చైనా 45 బిలియన్ డాలర్లు వెచ్చించగా.. అందులో సగం రోడ్లు, రైలు, విమాన రవాణా వసతుల కల్పనకు ఖర్చు చేసింది.
నిరుపయోగంగా రూ.3.4 వేల కోట్ల స్టేడియం
అయితే, క్రీడల పేరిట చేపట్టే మౌలిక వసతుల అభివృద్ధి దీర్ఘకాలంలో ఆయా నగరాలకు వరంగా మారే అవకాశం ఉందని కొందరు వాదిస్తుంటారు. కానీ, 1970ల తర్వాత ఆ పరిస్థితులు మారిపోయాయి. చేస్తున్న ఏర్పాట్లు ఆయా నగరాల స్తోమతకు మించిపోతున్నాయి. ఒలింపిక్స్ కోసం నిర్మించే క్రీడా మైదానాలు, రోడ్లు, భవనాలు చాలా వరకు నిరుపయోగంగా మారుతున్నాయి. పైగా దీర్ఘకాలంలో వాటి నిర్వహణ కష్టసాధ్యమవుతోంది. బీజింగ్‌లో నిర్మించిన 'బర్డ్స్ నెస్ట్' స్టేడియం నిర్మాణానికి 460 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.3.4 వేల కోట్లు) ఖర్చు చేశారు. ఇక దీని వార్షిక నిర్వహణ ఖర్చు 10 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. 2004 ఒలింపిక్స్ కోసం ఏథెన్స్‌లో నిర్మించిన దాదాపు అన్ని వసతులు ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయి.
అప్పుల్లో కూరుకుపోయిన నగరాలు