గడువు తీరిన ఏడాది తర్వాత కూడా డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకునేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం గడువు ముగియటానికి నెల ముందు, లేదా గడువు తీరిన నెల తరువాత మాత్రమే ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పునరుద్ధరించుకునే వెసులుబాటు ఉంది. ఆ గడువును తాజాగా కేంద్రం ఏడాదికి పెంచింది. వాణిజ్య వాహనాల పర్మిట్‌ల పునరుద్ధరణకు ప్రస్తుతం ఉన్న 30 రోజుల గడువును 60 రోజులకు పెంచింది. అలాగే లెర్నింగ్ లైసెన్సును కూడా ఆన్‌లైన్‌లో పొందేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం రవాణాశాఖ ఆమోదించిన సంస్థల నుంచి శిక్షణ పొందినట్లు ధ్రువపత్రం, వైద్య తదితర అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో సంబంధిత ప్రాంత రవాణా శాఖ కార్యాలయానికి పంపాల్సి ఉంటుందని తెలిపింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ పత్రా(ఆర్‌సీ)లను కేంద్ర డేటాకు అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్
నూతన వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్ల వద్దే పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రస్తుతం చెల్లింపులు, వాహనాల తాలూకూ పత్రాలను ఆన్‌లైన్‌లో రవాణాశాఖకు పంపడంతోపాటు, తనిఖీ కోసం వాహనాన్ని రవాణాశాఖ కార్యాలయానికి తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ విధానానికి స్వస్తి పలికి, ఎలాంటి మార్పుల అవసరం లేని వాహనాలను(బైకులు, కార్లు, జీపులు వంటివి) డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొన్న కేంద్రం, అందుకు అనుగుణంగా 'వాహన్ పోర్టల్'ను అనుసంధానం చేసినట్లు తెలిపింది. మార్పులు చేసేందుకు అవకాశం ఉన్న వాణిజ్య వాహనాలు తదితరాలను మాత్రం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా తనిఖీల కోసం రవాణాశాఖ కార్యాలయానికి తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపింది.