తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా కాలంలో బ్యాంకులు సరికొత్తగా... - preferred to digital contacts

కొవిడ్‌ కారణంగా చాలా మార్పులు జరిగాయి. మరో అయిదేళ్లకు కానీ డిజిటల్‌, కాంటాక్ట్‌లెస్‌ సాంకేతికతకు ప్రజలు మారకపోవచ్చని అనుకున్నా.. కరోనాతో చాలా వేగంగా డిజిటల్‌ బ్యాంకింగ్‌ వైపు మొగ్గుచూపారు. దీంతో బ్యాంకింగ్‌ రంగంలో శాఖల విస్తరణకు బ్రేకులు పడ్డాయి. అయితే సరికొత్త రూపుతో ముందుకురానున్నాయి. పరిమాణంలో చిన్నగా.. సాంకేతికతలో అనేక మార్పులు జరగనున్నాయి.

The banking system with the latest changes preferred to contact less services
బ్యాంకింగ్‌ వ్యవస్థలో సరికొత్తగా మార్పులు

By

Published : Jun 17, 2020, 9:15 AM IST

కరోనా కారణంగా అందరూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఎక్కువ మంది వినియోగదార్లు బ్యాంకులకు రాకుండానే డిజిటల్‌ పద్ధతిలో లావాదేవీలు జరుపుకుంటున్నారు. దీంతో బ్యాంకులు శాఖల విస్తరణను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాయని స్వయనా బ్యాంకర్లే చెబుతున్నారు. డిజిటల్‌ లావాదేవీలు చాలా సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా.. భౌతికంగా దూరంగా ఉండడం వల్ల అత్యంత సురక్షితం కూడా. వైరస్‌ కన్నా వేగంగా ఈ డిజిటల్‌ లావాదేవీల వ్యాప్తి జరుగుతుండటం మంచి విషయమేనని బ్యాంకింగ్‌ వర్గాలు అంటున్నాయి. శాఖల విస్తరణకు బ్రేకులు పడడం మంచి విషయం.. ఇది కాంటాక్ట్‌లెస్‌ బ్యాంకింగ్‌ దిశగా అడుగులు ప్రారంభం అయ్యాయని ఓ ప్రైవేటు బ్యాంకు సీఈఓ అంటున్నారు.

బ్యాంకర్లతో లైవ్​ చాట్​

బ్యాంకులు ఇప్పటికే సాంకేతిక కంపెనీలతో మాట్లాడి ఇంటరాక్టివ్‌ టెల్లర్‌ మెషీన్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌తో పాటు.. అవసరమైతే బ్యాంకర్లతో లైవ్‌ చాట్‌కు వీలు కల్పించేలా వీటిని రూపుదిద్దనున్నారు. శాఖల్లో కూడా విత్‌డ్రాయల్స్‌కు క్యూర్‌ కోడ్‌ను ప్రవేశపెట్టేలా మార్పులు తీసుకురానున్నారు. కొత్త శాఖలు ఇకపై చాలా చిన్నగా, తక్కువ వ్యక్తులతో ఎక్కువ సాంకేతికతతో రాబోతున్నాయని దేశంలో 2.48 లక్షల ఏటీఎమ్‌లను ఏర్పాటు చేసిన ఎన్‌సీఆర్‌ కార్ప్‌ ప్రాంతీయ వైస్‌ ప్రెసిడెంట్‌(ఆసియా పసిఫిక్‌) నవ్రోజ్‌ దస్తుర్‌ అంచనా వేస్తున్నారు. భారీ మొత్తం విత్‌డ్రాయల్స్‌, డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు, బేరర్‌ చెక్‌లకు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాగా, ఇప్పటికే స్టాండర్డ్‌ చార్టర్డ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లకు ఇంటరాక్టివ్‌ ఏటీఎమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఎన్‌సీఆర్‌ తెలిపింది. సమీప భవిష్యత్‌లో మరిన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు జరుగుతున్నాయని వివరించింది.

శాఖల అవసరమూ ఉంది

2000 చదరపు అడుగుల నుంచి 400 చదరపు అడుగులకు శాఖలు కుచించుకుపోవచ్చని బ్యాంకర్లు సైతం అంచనా వేస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు సేవలు అందించడం వంటి ప్రత్యేక అవసరాలకు మాత్రమే శాఖలు ఉండొచ్చని.. వచ్చే కొన్నేళ్లలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ఎస్‌బీఐ ఉన్నతాధికారి ఒకరు అంటున్నారు. అయితే పాత శాఖలు మూస్తామని కానీ.. కొత్త శాఖలు ఉండవని కానీ చెప్పబోవట్లేదన్నారు. ఇప్పటికే గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల వినియోగదార్లకు శాఖల అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వినియోగదారుతో సంబంధాలు, శాఖలు అవసరమని స్పష్టం చేశారు. ఎస్‌బీఐ గతేడాది 500 శాఖలు ప్రారంభించగా.. ఫెడరల్‌ బ్యాంకు గత నాలుగేళ్లలో 32 మాత్రమే ఏర్పాటు చేసింది. శాఖలు ఉంటాయి కానీ.. అందులో మార్పులు జరుగుతాయని బ్యాంకర్లు అంటున్నారు.

ఇదీ చూడండి:కరోనా వేళ సెకండ్ హ్యాండ్ వస్తువులు సురక్షితమేనా?

ABOUT THE AUTHOR

...view details