ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఇప్పట్లో భారత్‌లోకి ప్రవేశించే సూచనలు కనిపించడం లేదు. ఈ కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని ఆయన ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. కానీ, అలాంటి ఆలోచనలేవీ లేవని సంబంధిత కేంద్ర మంత్రి పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు.
జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే, సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఓ షరతు విధించారు. తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామని తెలిపారు. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని తేల్చి చెప్పారు. అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.