తెలంగాణ

telangana

ETV Bharat / business

యువత మొగ్గు రక్షణ పథకాలవైపే - punit nanda interview

బీమా అంటే పొదుపు పాలసీ అనే భావన నేడు క్రమంగా మారుతోంది. ఈ తరం యువత ఆర్థిక రక్షణకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే టెర్మ్​ పాలసీలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పొదుపు పథకాలు, బీమా పాలసీలను ఎలా సమన్వయం చేసుకోవాలో మనకు తెలియజేస్తున్నారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ డిప్యూటీ ఎండీ పునీత్‌ నందా.

term and insurance policies and their importance
యువత మొగ్గు రక్షణ పథకాలవైపే

By

Published : Dec 26, 2019, 5:22 PM IST

‘ఒకప్పటిలా బీమా అంటే.. పొదుపు పాలసీలనే భావన ఇప్పుడు లేదు. పాలసీదారులు ఇప్పుడు ముందుగా ఆర్థిక రక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పాలసీల జారీ నుంచి క్లెయిం వరకూ పూర్తిగా ఇప్పుడు సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తోంది’ అని అంటున్నారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ డిప్యూటీ ఎండీ పునీత్‌ నందా. వినూత్న పాలసీలు తీసుకొస్తేనే బీమా సంస్థలకు వ్యాపారాభివృద్ధి సాధ్యమని అంటున్నారు. ఆయన ‘ఈనాడు’కిచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..

  • రాబోయే రెండు, మూడేళ్లలో జీవిత బీమా రంగంలో వచ్చే కీలక మార్పులు ఏమిటి? ఇవి ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి?

కుటుంబంలో ఆదాయం ఆర్జించే వ్యక్తి దూరం అయినప్పుడు ఆర్థికంగా ఆదుకునేది జీవిత బీమా. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడం, సులువుగా ఎంపిక చేసుకోవడం కీలకంగా ఇప్పుడు పథకాల రూపకల్పన జరుగుతోంది. డిజిటల్‌ వేదికల ద్వారా పాలసీదారులకు కావాల్సిన కచ్చితమైన పథకాలను అందించేందుకు బీమా సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇప్పుడు బీమా పాలసీలను మొబైల్‌ వ్యాలెట్లు, పేమెంట్‌ బ్యాంకుల ద్వారా తీసుకునేందుకు వీలవుతోంది. పాలసీదారులు పూర్తి రక్షణకే పరిమితమయ్యే టర్మ్‌ పాలసీలపై దృష్టి పెడుతున్నారు. దీంతో వీటికి ఆదరణ పెరుగుతోంది. తక్కువ ప్రీమియంతో ఇవి అందుబాటులోకి రావడంతో ఆకర్షిస్తున్నాయి.కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌లాంటి సాంకేతికతలు బీమా పాలసీల జారీలో ముఖ్య పాత్ర పోషించనున్నాయి.

  • దేశ ప్రజలకు ఉండాల్సిన బీమాకూ.. ఉన్న బీమాకు మధ్య వ్యత్యాసం ఉందని సర్వేలు చెబుతున్నాయి? బీమా సంస్థలు దీన్ని ఎలా చూస్తున్నాయి?

దేశంలో ఇప్పటికీ చాలా కుటుంబాలకు బీమా పాలసీలు లేవు. కుటుంబంలో ఆర్జించే వ్యక్తి.. ముఖ్యంగా యువతకు ప్రొటెక్షన్‌ పాలసీలు కచ్చితంగా ఉండాలి. దీర్ఘకాలిక లక్ష్య సాధన కోసం పొదుపు పాలసీలు తీసుకోవాలి. ఎలాంటి బీమా రక్షణ లేని వారిని గుర్తించేందుకు సాంకేతికతను విరివిగా వాడుతున్నాయి. వారిని రక్షణ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా వారికి సరిపోయే పాలసీలను రూపొందించి, అందించడం ద్వారా వారిని ఆకట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

  • బీమా సంస్థలు నగరాలు, పట్టణాలపైనే దృష్టి పెట్టినట్లుగా గ్రామీణ భారతాన్ని పట్టించుకోవడం లేదు. దీనికి కారణాలేమిటి?

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బీమా పాలసీలను అందించేందుకు మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీలు, అందుబాటు ధరలో ప్రీమియం, బీమా పాలసీలపై అవగాహన కల్పించడం ద్వారా బీమా సంస్థలు వారికి పాలసీలను దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన సులభంగా, తక్కువ ప్రీమియానికే తీసుకునే వీలుండటంతో చాలామంది బీమా పరిధిలోకి వచ్చారు. బీమా పాలసీ ద్వారా లభించిన ప్రయోజనాన్ని చూసి, కొత్తగా ఇందులో చేరేవారు పెరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం పెరిగితే.. పెద్ద మొత్తంలో బీమా రక్షణ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. సూక్ష్మరుణ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు, డిజిటల్‌ వ్యాలెట్లు, పేమెంట్‌ బ్యాంకుల ద్వారా అందిస్తున్నాం.

  • పాలసీల ప్రచారంలో మీ సంస్థ ఆలోచన ఎలా ఉంది?

జీవిత బీమా రెండు ప్రధాన లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. ఆధారపడిన వారికి ఆర్థిక రక్షణ కల్పించడం, పొదుపు అలవాటును పెంచడం. ప్రస్తుతం వీటినే బీమా సంస్థలు ఎక్కువగా అందిస్తున్నాయి. ఇటీవల పాలసీదారులు ముందు రక్షణ.. తర్వాతే పొదుపు అన్న అవగాహనకు వచ్చారు. దీంతో ప్రొటెక్షన్‌ పాలసీలకు గిరాకీ పెరుగుతోంది. మా వరకూ చూస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో రక్షణ పాలసీల్లో 61శాతం వృద్ధి సాధించాం. కొత్త బీమా ప్రీమియం వసూళ్లలో 20శాతానికి పైగా ఈ పాలసీల ద్వారానే వచ్చింది.

  • మీ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి లక్ష్యాలను విధించుకుంది?

రాబోయే 3-4 ఏళ్లలో మా కొత్త బీమా పాలసీల సంఖ్యను రెట్టింపు చేయాలని అనుకుంటున్నాం. పాలసీలను తీసుకునే దగ్గర్నుంచి, క్లెయిం చెల్లించడం వరకూ మొత్తం కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఉండి, బీమా పాలసీ తీసుకోవడానికి ఇబ్బంది ఎదుర్కొంటున్న వారి కోసం ఇటీవలే టర్మ్‌ పాలసీని ప్రవేశ పెట్టాం.

ఇదీ చూడండి: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

ABOUT THE AUTHOR

...view details