తెలంగాణ

telangana

ETV Bharat / business

'టెలికాం రంగం' తిప్పలు.. సంక్షోభం నుంచి గట్టెక్కేనా! - జాతీయ వార్తలు తెలుగులో

దేశాభివృద్ధికి దోహదపడే కీలక రంగాల్లో ఒకటైన టెలికాం రంగం పెనుసంక్షోభంలో కూరుకుపోతోంది. జీడీపీలో 8.2 శాతానికి ఎదిగే అవకాశాల ముంగిట నిలిచిన ఈ రంగం.. సుప్రీం కోర్టు తీర్పు దరిమిలా ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. ఇప్పటికే 29-32 శాతం పన్నులు, సుంకాల భారాన్ని మోస్తున్న టెలికాం సంస్థలపై సుప్రీంతీర్పు గాయంపై గునపంపోటు లాంటిదంటున్న పరిశ్రమ వర్గాలు క్యురేటివ్‌ పిటిషన్ల ద్వారా మళ్ళీ న్యాయపాలికనే ఆశ్రయించాలనుకొంటున్నాయి.  5జీ సాంకేతిక విప్లవానికి దేశాన్ని సన్నద్ధం చెయ్యాల్సిన దశలో టెలికాం రంగంలో అనిశ్చితి శ్రేయస్కరం కానేకాదు!

telecom-sector-flips-dot-get-out-of-the-crisis
'టెలికాం రంగం' తిప్పలు.. సంక్షోభం నుంచి గట్టెక్కేనా!

By

Published : Jan 18, 2020, 6:32 AM IST

ఆర్థిక సంస్కరణల శకంలో భారతావని ప్రగతి సౌధానికి పునాదులు వేసిన కీలక రంగాల్లో టెలికాం ఒకటి. ఇండియా స్థూల దేశీయోత్పత్తిలో ఇప్పటికే ఆరున్నర శాతం వాటా కలిగి, 5జీ సాంకేతికత అందిపుచ్చుకొన్నాక జీడీపీలో 8.2 శాతానికి ఎదిగే అవకాశాల ముంగిట నిలిచిన టెలికాం రంగం- సర్వోన్నత న్యాయపాలిక తీర్పు దరిమిలా పెనుసంక్షోభంలో కూరుకుపోతోంది.

ఈ నెల 23వ తేదీకల్లా లక్షా 47 వేలకోట్ల రూపాయల బకాయిల్ని టెలికాం సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలన్న అక్టోబరునాటి సుప్రీంకోర్టు ఆదేశాలపై పునస్సమీక్ష కోరుతూ ఆయా సంస్థలు దాఖలు చేసిన అభ్యర్థనల్ని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఇప్పటికే 29-32 శాతం పన్నులు, సుంకాల భారాన్ని మోస్తున్న టెలికాం సంస్థలపై సుప్రీంతీర్పు గాయంపై గునపంపోటు లాంటిదంటున్న పరిశ్రమ వర్గాలు క్యూరేటివ్‌ పిటిషన్ల ద్వారా మళ్ళీ న్యాయపాలికనే ఆశ్రయించాలనుకొంటున్నాయి.

చెల్లించాల్సినవి వేల కోట్లల్లో...

నిరుడు జులైలో కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించిన మేరకు- ఎయిర్‌టెల్‌ రూ.21,682 కోట్లు, వోడాఫోన్‌ రూ.19,823 కోట్లు, అనిల్‌ అంబానీ రిలయెన్స్‌ కమ్యూనికేషన్స్‌ రూ.16,456 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2,098 కోట్లు ఎమ్‌టీఎన్‌ఎల్‌ రూ.2,537 కోట్లు లైసెన్స్‌ ఫీజు రూపేణా చెల్లించాల్సి ఉంది. దానిపై వడ్డీ, అపరాధ రుసుము, దానిపై వడ్డీ తడిసి మోపెడై ప్రైవేటు టెలికాం సంస్థల అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)లో కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్ట వాటా ఇవ్వడానికి సమ్మతించిన టెలికాం సంస్థలు- ఏజీఆర్‌కు కేంద్ర ప్రభుత్వ టెలికాం విభాగం ఇచ్చిన నిర్వచనం సరికాదంటూ న్యాయవివాదానికి దిగాయి.

కేంద్రం స్పందనేంటి...

పద్నాలుగేళ్లుగా పీటముడి పడిన వివాదాన్ని పరిష్కరిస్తూ- కేంద్ర సర్కారు ప్యాకేజీకి సమ్మతించడం ద్వారా విపరీతంగా లబ్ధి పొందిన సంస్థలు ప్రభుత్వానికి చెల్లింపుల విషయంలో కొర్రీలు పెడుతున్నాయంటూ ‘సుప్రీం’ ఇచ్చిన తీర్పు టెలికాం రంగానికి గుదిబండగా మారనుంది. వోడాఫోన్‌ లాంటివి బోర్డు తిప్పేసే ప్రమాదమూ ఉందని సంబంధీకులే ఆందోళన వ్యక్తీకరిస్తున్న నేపథ్యంలో తనవంతుగా కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి!

భారీ లైసెన్సు రుసుములకు తలూపి ఆపై అంచనాలు తలకిందులై నిలువులోతు నష్టాల్లో కూరుకున్న ప్రైవేటు ఆపరేటర్లను ఆదుకోకుంటే టెలికాం సేవల విస్తృతి, ఆ రంగం మనుగడే దుర్లభమవుతుందన్న వాజ్‌పేయీ సర్కారు దూరాలోచన 1999నాటి కొత్త టెలికాం విధానంలో ప్రస్ఫుటమైంది. స్థిర లైసెన్సు రుసుము చెల్లింపు నుంచి రాబడుల్లో సర్కారుకు వాటా కట్టబెట్టేలా తెచ్చిన కొత్త విధానానికి ప్రైవేటు టెలికాం సంస్థలన్నీ నాడు అంగీకరించాయి. సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌)లో 15శాతం వాటాను తొలుత నిర్ణయించిన ప్రభుత్వం 2013లో దాన్ని ఎనిమిది శాతానికి తగ్గించింది. 2004లో రూ.4,855 కోట్లుగా ఉన్న టెలికాం సంస్థల స్థూల ఆదాయం 2015 నాటికి దాదాపు రెండు లక్షల 38 వేలకోట్ల రూపాయలకు పెరిగింది! తొలినాళ్లలోనే స్థూల రాబడి నిర్వచనాన్ని ముసాయిదా ఒప్పందంలో 19వ నిబంధనగా చేర్చిన సర్కారు, ఏజీఆర్‌ను ఎలా లెక్కించాలో కూడా విపులీకరించింది. అప్పట్లో వాటికి ఆమోదం తెలిపి తరవాత టెలికామ్‌యేతర రాబడులు ఏజీఆర్‌ పరిధిలోకి రాబోవంటూ ప్రైవేటు సంస్థలు మడత పేచీకి దిగడమే సుదీర్ఘ న్యాయ వివాదానికి మూలకారణమైంది.

జియో రాకతో.. స్థూల రాబడుల్లో కోత...

జియో రాక దరిమిలా ప్రపంచంలోనే కారుచౌకగా ఎనిమిది రూపాయలకే ఒక గిగాబైట్‌ డేటా లభ్యమయ్యేలా ధరల పోరు ముమ్మరించి 2017-19 ఆర్థిక సంవత్సరాల మధ్య స్థూల రాబడుల్లో పాతిక శాతం కోతపడింది. 2015లో ప్రతి వినియోగదారుడి నుంచి సగటున రూ.174గా ఉన్న రాబడి నేడు రూ.113కు పడిపోయి టెలికాం రంగం కుదుపులకు లోనవుతున్న వేళ- దాదాపు లక్షా 40 వేలకోట్ల రూపాయల చెల్లింపుల భారంతో అది పూర్తిగా కుదేలయ్యే ముప్పు పొంచి ఉంది. 5జి సాంకేతికత అభివృద్ధికి కొత్త గవాక్షాలు తెరుస్తున్న తరుణంలో ప్రైవేటు శక్తుల సత్తువ హారతి కర్పూరం కాకుండా, కేంద్రమూ నష్టపోకుండా ఉభయతారక వ్యూహంతో ముందడుగెయ్యాలి!

సుప్రీం శరణు కోరుతున్న ప్రభుత్వ సంస్థలు...

టెలికాం విభాగం వెబ్‌సైట్‌ ప్రకారం దేశీయంగా టెలికాం లెసెన్సు పొందిన సంస్థలు 3,468 ఉన్నాయి. టెలికామ్‌యేతర రాబడుల్ని సైతం లెక్కగట్టి ఏజీఆర్‌లో వాటా కోసం టెలికాం విభాగం జారీచేస్తున్న నోటీసుల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలే మూడు లక్షల కోట్ల రూపాయలు దాటిపోయాయి! దాదాపు 95 శాతం రాబడి విద్యుత్‌ సరఫరా ద్వారానే పొందుతున్న పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు రెండు శాతం టెలికాం సేవల ద్వారా వస్తోంది. నిరుడు టెలికాం వ్యాపారం ద్వారా రూ.742 కోట్లు ఆర్జించిన సంస్థ లెసెన్స్‌ ఫీజుగా చెల్లించాల్సింది రూ.59 కోట్లే అయినా ఎకాయెకి లక్షా పాతిక వేలకోట్ల రూపాయలు కక్కాల్సిందేనంటూ టెలికాం విభాగం తాఖీదు పంపింది. గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు అందిన శ్రీముఖం లక్షా 72 వేలకోట్లు చెల్లించాలంటోంది. సుప్రీం శరణు కోరుతున్న ఈ ప్రభుత్వరంగ సంస్థలకు ఏపాటి ఉపశమనం దక్కుతుందో చూడాలి!

టెలికాం సంస్థలకు జవజీవాలు కల్పించడంపై ఏర్పాటైన కార్యదర్శుల కమిటీని అర్ధాంతరంగా రద్దు చేసిన కేంద్రసర్కారు- రూ.42,000 కోట్ల స్పెక్ట్రమ్‌ చెల్లింపులపై రెండేళ్ల మారటోరియాన్ని ప్రకటించి, అక్కడికదే చాలంటోంది. స్పెక్ట్రమ్‌ వేలం విధానం రాక ముందునాటి రాబడుల్లో వాటా పద్ధతికి కాలంచెల్లిందని, స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా భారీమొత్తాల్ని కేంద్రం ముందే రాబట్టుకొంటున్నప్పుడు వేరే లైసెన్సుల ఫీజు వసూళ్లూ సరైన పంథా కాదన్న వాదనలు వినవస్తున్నాయి. పన్నులు, సుంకాలు, రుసుములు ఏవైనా పొదుగు కోసి పాలు తాగేలా ఉండనే కూడదు. 5జి సాంకేతిక విప్లవానికి దేశాన్ని సన్నద్ధం చెయ్యాల్సిన దశలో టెలికాం రంగంలో అనిశ్చితి శ్రేయస్కరం కానేకాదు!

ABOUT THE AUTHOR

...view details