సమాచారం.. చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన వనరు. సర్వాంతర్యామిలా మారిన అంతర్జాలం- ప్రపంచాన్ని విజ్ఞాన గనిలా మార్చింది. విజ్ఞానం ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ, విశ్వాన్వేషణ, సాంకేతిక పరిజ్ఞానాలు, వ్యాపారాలు, యుద్ధం, శాంతితోపాటు మానవ జీవితానికి సంబంధించి ఎలాంటి విషయంలోనైనా అంతర్జాలం కీలక ఉపకరణంలా స్థిరపడిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమృద్ధికి, పేదరిక నిర్మూలనకు దోహదపడింది. ప్రాథమికంగా టెలికాం విధానం లక్ష్యం- ఫోన్‌లో మాట్లాడుకోవడానికే పరిమితమైంది. ఇప్పుడు ఫోన్‌లో అంతర్జాలాన్ని అందించే డేటాకే అధిక ప్రాధాన్యం దక్కుతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సమాచార లభ్యత వ్యసనంలా మారింది. ఎంతగా అంటే, అధికరణ 370 రద్దు తరవాత జమ్మూకశ్మీర్‌లో చాలామంది ఇతరత్రా నిత్యావసరాలకన్నా అంతర్జాల పునరుద్ధరణ కోసమే ఎక్కువగా డిమాండ్ చేయడం గమనార్హం. భారతీయుల ఇళ్లలోకి విద్యుత్తు, గ్యాస్ ప్రవేశించడానికి ఏడు దశాబ్దాలు పట్టింది. చరవాణులు కేవలం రెండు దశాబ్దాల్లో అందరి చేతుల్లోకి వచ్చేశాయి.
జాతి భద్రతకూ ప్రమాదం
ప్రస్తుతం ప్రపంచ ఇంధన వినియోగంలో అంతర్జాలం / ఇన్‌ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) వాటా 6-10 శాతంగా ఉంటోంది. ఇది నాలుగు శాతం హరిత గృహ వాయువుల్ని విడుదల చేస్తోంది. దీని పెరుగుదల ఏటా 5-7 శాతందాకా ఉంటోంది. అంతర్జాలాన్ని ఉపయోగించడం అనేది తప్పనిసరి వ్యవహారమే. దీనికోసం మనం నివసించే భూగ్రహాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మరోవైపు సామాజిక మాధ్యమాలు పెద్ద సవాలుగా పరిణమించాయి. కీలకమైన జాతీయ భద్రత అంశాల్లో ప్రభుత్వాలు సామాజిక మాధ్యమ దిగ్గజాల్ని నిలువరించడం కష్టంగా మారింది. ప్రజాస్వామ్య దేశాల్లో పౌర ఉద్యమాల సందర్భంగా, ప్రభుత్వాలు పోలీసు చర్యతోపాటు ఇలాంటి మాధ్యమాలపై ఆంక్షలకు దిగాల్సి వస్తోంది. సామాజిక మాధ్యమాల వ్యసనం పెచ్చరిల్లడానికి ఉచితంగా, చవగ్గా డేటా అందుబాటులోకి రావడమే కారణం. ఇది సామాజికంగా సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీయడమే కాకుండా, జాతీయ భద్రతకూ పెనుముప్పుగా పరిణమించింది.
ప్రారంభంలో ఆరోగ్యకరమైన పోటీ ముసుగులో టెలికాం సంస్థలు, ప్రభుత్వం రుసుములకు కనీస ధర నిర్ణయించడానికి విముఖత చూపాయి. ఇది ఆదాయాల పరంగా కోలుకోలేని పతనానికి దారితీసింది. సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్)పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరవాత- ఆర్థిక ఒత్తిడికి గురైన టెలికాం రంగానికి టారిఫ్‌లను పెంచడంద్వారా తోడ్పాటు అందించాలని కోరుతూ వోడాఫోన్-ఐడియా, భారతి ఎయిర్‌టెల్ సంస్థలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. ఈ క్రమంలో అనివార్య పరిస్థితుల్లో 40 శాతందాకా రుసుముల్ని పెంచారు. ఏజీఆర్‌పై సుప్రీంకోర్టు స్పష్టమైన వివరణ ఇస్తూ, ప్రభుత్వానికి ఉన్న బకాయిల్ని తీర్చేయాలని టెలికాం సంస్థలకు స్పష్టం చేసింది. ఆ క్రమంలో పరిశ్రమకు కొంత క్రమశిక్షణ అవసరమని భారతి ఎయిర్‌టెల్ పేర్కొంది. ఇదే భారతి ఎయిర్‌టెల్- ఆర్‌కామ్‌తో కలిసి చందాదారుల సంఖ్యను పెంచుకునేందుకు హేతుబద్ధంకాని రీతిలో ధరల తగ్గింపు వ్యూహాన్ని అనుసరించింది. ఈ విషయంలో ఏదేని వస్తువును/ సేవను ఉత్పత్తి వ్యయంకన్నా తక్కువ ధరకు అమ్మకూడదన్న ప్రాథమిక ఆర్థిక సూత్రాన్ని విస్మరించారనడంలో సందేహం లేదు.
నష్టానికి ఆరు కారణాలు
ప్రభుత్వం, నియంత్రణ ప్రాధికార సంస్థల నిర్లక్ష్యం ఫలితంగా సర్కారు ఖజానాకు నష్టం వాటిల్లింది. అందుకు ఆరు కారణాలున్నాయి.
- లైసెన్స్ రుసుములు, స్పెక్ట్రమ్, స్పెక్ట్రమ్ వినియోగ రుసుము(ఎస్‌యూసీ), అంతర అనుసంధాన వినియోగ రుసుము(ఐయూసీ) వంటి సేవలకు ధరల్ని నిర్ణయించే విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గణనీయమైన నష్టం వాటిల్లింది.
- రుసుములు ఉదారంగా ఉన్నప్పటికీ, టెలికాం సంస్థలు ఏజీఆర్ లెక్కింపుపై వివాదాన్ని లేవనెత్తడంతో అది సుదీర్ఘ న్యాయపోరాటానికి దారితీసింది. 2019 అక్టోబర్ 31 నాటికి బకాయిలు పేరుకుపోయాయి. లైసెన్స్ రుసుములకు సంబంధించి రూ.92 వేల కోట్లు, ఎస్‌యూసీ కోసం రూ.55 వేల కోట్ల బకాయిలు పేరుకున్నాయి. బకాయిల్ని వెంటనే చెల్లించాలంటూ సుప్రీంకోర్టు టెలికాం సంస్థల్ని ఆదేశించినా, ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి, మరో రెండేళ్ల విరామాన్ని అందించింది.
- టెలికాం సంస్థలు అనుసరించిన అనైతిక, అస్థిర వ్యాపార నమూనాలు, వాటి ఆదాయాలకు గండికొట్టాయి. అవి భారీ రుణ ఊబిలో చిక్కుకునేలా చేశాయి. రూ.4.5 లక్షల కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి. ఇది బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగిపోయేందుకూ దారితీసింది.
- రూ.49 వేలకోట్లకు సంబంధించి ఆర్‌కామ్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ప్రస్తుత సూచీ ప్రకారం చూస్తే, ఇది 30 శాతంకన్నా తక్కువగానే నష్టం భర్తీ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
- ఈ రంగంలో పలు సంస్థల నిష్క్రమణలు, విలీనాల అనంతరం, ఆర్థిక చిక్కుముడుల ఫలితంగా, డజనుదాకా ఉన్న టెలికాం సంస్థలు మూడుకు తగ్గిపోయాయి.
- బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్ ప్రభుత్వరంగ సంస్థలు కావడంతో విధాన ప్రణాళిక పరంగా... సమస్థాయి పోరు, మూలధన వ్యయం (క్యాపెక్స్), నిర్వహణ వ్యయం(ఓపెక్స్) వంటివాటిపై వెనకంజవేశాయి. మనుగడ సాగించలేని స్థాయిలో ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఈ క్రమంలో 90 వేల ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్)తో కలుపుకొని రూ.77 వేలకోట్లతో కూడిన పునరుద్ధరణ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొంత ఆలస్యం జరిగినా, టెలికాం సేవలకు కనీస ధర నిర్ణయించేందుకు ఓ సంప్రతింపుల పత్రాన్ని తీసుకొచ్చే దిశగా భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) చర్య తీసుకోవడం మంచి పరిణామమే. టెలికాం సంస్థలు వినియోగదారులకు నిర్దేశిత సేవల నాణ్యత (క్యూఓఎస్) పరామితుల మేరకు నాణ్యమైన సేవలు అందించేందుకు పోటీ పడటంపై దృష్టి సారించాలి.