రాష్ట్రంలో ఐటీ రంగం జాతీయ సగటు కన్నా మెరుగైన వృద్ధిరేటు నమోదు చేసిందని ఆ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జాతీయ సగటు వృద్ధిరేటు 8.09 శాతం ఉంటే, తెలంగాణలో 17.97 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలోనూ ఐటీశాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. శనివారం ఐటీ శాఖ ఆరో వార్షిక ప్రగతి నివేదికను మంత్రి విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే దేశంలో తెలంగాణ ఐటీ ఎగుమతుల వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్ర ఉద్యోగ వృద్ధిరేటు 7.2 శాతంగా ఉందని వివరించారు.
1.16 లక్షల మందికి ఉపాధి
2020ని ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఏడాదిగా ప్రకటించామని, ఈ విభాగంలోని సంస్థలతో ఇప్పటికే ఎనిమిది ఒప్పందాలు చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో 250కి పైగా సంస్థలు 1.16 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, 2019లో రూ.7,337 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. వన్‌ప్లస్ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. టాస్క్ ద్వారా 3.5 లక్షల మంది యువకులకు శిక్షణ ఇచ్చామని, దాదాపు 4,500 మంది ప్రత్యక్షంగా నియామకాలు పొందారన్నారు.