ఇతర కంపెనీలతో భాగస్వామ్యాలు, సాంకేతికత బదిలీలు, వివిధ కీలక సామగ్రి, పదార్థాల సరఫరాలు పెరిగినపుడే గిరాకీకి తగ్గట్లుగా టీకా ఉత్పత్తిని పెంచడం సాధ్యమవుతుందని భారత్ బయోటెక్ సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్ల పేర్కొన్నారు. శనివారం జరిగిన ఈయూ-ఇండియా బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే..
అక్కడ కొవాగ్జిన్ నమోదుకు సిద్ధం
"మేం మా టీకా (కొవాగ్జిన్)ను అమెరికాలో రిజిస్టర్ చేస్తున్నాం. ఐరోపాలో చేయడానికీ సిద్ధంగా ఉన్నాం. ఈయూలోని కంపెనీలు, అకడమిక్ సంస్థలు మాతో జట్టుకడితే అంత కంటే సంతోషం లేదు. భారత్ లోని 130 కోట్ల జనాభాకు సరిపడా 260 కోట్ల డోసులను తక్కువ సమయంలో అందించలేం. 200 కోట్ల డోసులు కూడా వేగంగా ఇవ్వడం ఏ దేశానికీ సాధ్యం కాని పని. అయితే ఇపుడు ఆ అవసరం ఉంది. మా ప్లాంట్లలో కొత్త సాంకేతికతలను వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు సాంకేతికత బదిలీ అవసరం అవుతుంది. అపుడు తక్కువ సమయంలో భారత్ కే కాదు.. ప్రపంచానికి టీకా అందించడానికి సాధ్యమవుతుంది."
-సుచిత్ర ఎల్ల, భారత్ బయోటెక్ సంయుక్త ఎండీ