వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1, 2020) నుంచి అమల్లోకి రాబోతున్న బడ్జెట్ తల్లిదండ్రులపై కొత్త భారాన్ని మోపనుంది. తమ పిల్లలను విదేశీ చదువుల కోసం పంపించినప్పుడు ఇక నుంచి అక్కడ చెల్లించే ఫీజులు, వసతి, వైద్య ఖర్చులతోపాటు.. దేశంలో చెల్లించేందుకు అదనంగా కొంత పన్ను మొత్తాన్నీ సమకూర్చుకోవాల్సిందే. దీనికి కారణం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 206సీ పరిధిని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించడమే. విదేశీ విద్యాభ్యాసం ఖరీదు పెరిగిపోయింది. భవిష్యత్తుపై ఆశతో చాలామంది తమ సొంత సంపాదనతో పాటు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని దీనికోసం ఖర్చు చేస్తుంటారు. దీంతోపాటు ఇప్పటికే అమెరికా డాలర్, యూరోల మారకపు విలువ క్రమంగా పెరుగుతోంది. దీంతోపాటు 5 శాతం టీసీఎస్‌నూ చెల్లించాల్సి రావడం అదనపు భారంగానే పరిణమించనుంది.
సెక్షన్ 206సీ లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం విదేశీ కరెన్సీని విక్రయించే వ్యక్తి (అధీకృత డీలర్).. కొనుగోలు చేసే వారి దగ్గర్నుంచి 5 శాతం పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలకు సమానమైన విదేశీ మారక ద్రవ్యాన్ని మించి కొనుగోలు చేసినప్పుడు ఈ టీసీఎస్ వర్తిస్తుంది. మరోమాటలో చెప్పాలంటే.. సంవత్సరం మొత్తం మీద రూ.7లక్షల విలువకు మించి, విదేశీ ద్రవ్యాన్ని కొనుగోలు చేస్తే.. అదనంగా 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ ఎల్‌ఆర్‌ఎస్ (లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం)లో భాగంగా విద్య, ఇతర అవసరాలకోసం 2,50,000 అమెరికన్ డాలర్ల విలువ వరకూ విదేశీ కరెన్సీని కొనడానికి వెసులుబాటు కల్పిస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగంగా ఒక ఆర్థిక సంవత్సరంలో చదువు, ప్రయాణ, ఆరోగ్య ఖర్చులు, బహుమతులు, విరాళాలు, దగ్గరి బంధువులకు పెట్టే ఖర్చులు తదితరాల కోసం 2,50,000 డాలర్ల విలువ వరకూ పంపించేందుకు అనుమతిస్తారు. దీంతోపాటు ఈ మొత్తాన్ని పొందేవారు.. షేర్లు, డెట్ పథకాల్లో మదుపు చేసేందుకూ, విదేశాల్లో స్థిరాస్తులను కొనేందుకూ ఉపయోగించుకోవచ్చు.
1 రూ.7లక్షలు దాటితే..
కొత్తగా అమల్లోకి రాబోతున్న నిబంధన ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో సుమారు 9,790 అమెరికన్ డాలర్లకు (రూ.7లక్షలకు సమానం) మించి విదేశాలకు పంపించాలంటే.. ఐదు శాతం అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కొనుగోలు చేసినప్పుడు... ఆ అధిక మొత్తంపై 5 శాతాన్ని మూలం వద్ద పన్ను వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 1,00,000 డాలర్లు కొనాలని అనుకున్నారనుందాం. దీనికోసం సొంతంగా, రుణాలు తీసుకొని ఆ డబ్బును సమకూర్చుకున్నాడు. కనీస పరిమితి పోను, మిగిలిన మొత్తంపై మరో 4,510 డాలర్ల వరకూ పన్ను కోసం చెల్లించాల్సి వస్తుంది.
* విదేశీ యాత్రలు చేసే వారికీ ఈ నిబంధనలే వర్తిస్తాయి. ఈ యాత్రలను నిర్వహించే సంస్థలూ సెక్షన్ 206సి నిబంధనల ప్రకారం 5 శాతం పన్ను అదనంగా వసూలు చేసి, ప్రభుత్వానికి జమ చేయాలి.
ఇలా మూలం వద్ద చెల్లించిన పన్నుకు తగిన జమ పొందాలంటే... ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. ఒకవేళ అధికంగా చెల్లిస్తే రిఫండు రూపంలో కోరవచ్చు. బ్యాంకు నుంచి తీసుకున్న విద్యారుణాలు, వైద్య ఖర్చులకు మినహాయింపు వర్తిస్తుందా లేదా అనే విషయంలో ఎలాంటి స్పష్టతా లేదు.
వడ్డీ ఆదాయాలకు...
ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్ల నుంచి వచ్చే డివిడెండ్ మొత్తం రూ.5,000 దాటితే మూలం వద్ద పన్ను కోత 10 (టీడీఎస్) విధించాలనే నిబంధన వచ్చిందని ఇప్పటికే తెలుసుకున్నాం. వడ్డీ ద్వారా ఆదాయంపై సెక్షన్ 194 ఏ కింద టీడీఎస్ ఎలా విధిస్తారంటే..