It Employees WFH News: ఐటీ ఉద్యోగులు నూరు శాతం కార్యాలయాలకు వచ్చి పనిచేయడం అనేది సమీప భవిష్యత్తులో ఉండకపోవచ్చని టీసీఎస్ సీనియర్ ఉపాధ్యక్షుడు వి.రాజన్న అభిప్రాయపడ్డారు. బదులుగా 'హైబ్రిడ్ వర్క్' పద్ధతికి ఐటీ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ 'ఒమిక్రాన్' రూపంలో విస్తరిస్తున్నందున ఐటీ కంపెనీలు పునరాలోచనలో పడ్డాయని, ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు ఇప్పుడే పిలిచే పరిస్థితి లేదని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో 'డిజిటలీకరణ' పెరుగుతుండటం, మన ఐటీ కంపెనీలకు సామర్థ్యాలు బాగున్నందునే జోరుగా ప్రాజెక్టులు లభిస్తున్నాయని 'ఈనాడు' ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ముఖ్యాంశాలివీ..
'ఒమిక్రాన్' ప్రభావం ఐటీ పరిశ్రమపై ఎలా ఉంటుంది?
ఏడాదిన్నరగా అత్యధిక ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచే (రిమోట్ వర్కింగ్) పనిచేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా ఐటీ పరిశ్రమలో పనివిధానాలు పూర్తిస్థాయిలో రూపాంతరం చెందాయి. అందువల్లే ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టటంతో అక్టోబరు నుంచి కొద్ది మంది ఉద్యోగులను ఆఫీసులకు పిలవడం, ఐటీ కంపెనీల ప్రతినిధులు వివిధ దేశాలకు వెళ్లి కస్టమర్లను కలవడం, కస్టమర్లు ఇక్కడ రావడం.. మొదలైంది. నేను కూడా కస్టమర్లతో సమావేశాలకు న్యూయార్క్, ముంబయి, దిల్లీ.. తదితర ప్రదేశాలకు వెళ్లాను. అమెరికా, ఐరోపాల్లో 'ఒమిక్రాన్' కేసులు వేగంగా పెరుగుతున్నందున, మళ్లీ అటువంటి ప్రయత్నాలన్నీ నిలిచిపోయాయి. ఉద్యోగులు ఆఫీసులకు రావడమూ తగ్గింది. ఐటీ ఉద్యోగులు అధిక సంఖ్యలో కార్యాలయాలకు వెళ్లడం ఇప్పట్లో ఉండకపోవచ్చు. టీసీఎస్‌లో అయితే 2025 నాటికి ఏ రోజైనా 25 శాతం మంది ఉద్యోగులే ఆఫీసుకు వచ్చి పనిచేస్తారు. ఉద్యోగులు 100 శాతం ఆఫీసుకు రావడం అనేది ఉండదు. టీసీఎస్- హైదరాబాద్ పరిధిలో దాదాపు 65,000 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 86 శాతం మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ టీకా ఇప్పించాం. అయినా 1-2 శాతం మంది ఉద్యోగులనే ఆఫీసుకు పిలుస్తున్నాం.
ఐటీ సేవలకు ఇప్పుడున్న అనుకూల స్థితి ఇటీవల కాలంలో ఎన్నడూ లేదని అంటున్నారు?
ప్రపంచ వ్యాప్తంగా డిజిటలీకరణ అత్యంత వేగంగా అమలవుతోంది. ఐటీ లేని వ్యాపార రంగం, ఐటీని అందిపుచ్చుకోని వ్యాపార సంస్థ ఉండటం సాధ్యం కాని పరిస్థితి. అందువల్ల మన ఐటీ కంపెనీలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాజెక్టులు వచ్చిపడుతున్నాయి. క్లౌడ్, అనలిటిక్స్, కృత్రిమ మేధ, యంత్ర అభ్యాసం (మెషీన్ లెర్నింగ్), సైబర్ భద్రత, 5జీ, వీఎల్‌ఎస్‌ఐ.. వంటి సాంకేతికతల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం లభిస్తోంది. డిమాండ్ ఎంత అధికంగా ఉందంటే, అవసరాలకు తగినంతమంది ఐటీ నిపుణులు దొరకడం లేదు. అందుకే పెద్ద సంఖ్యలో ఇంజినీర్లను ప్రాంగణ నియామకాల ద్వారా మేం తీసుకుంటున్నాం. దేశీయ ఐటీ పరిశ్రమ 20,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.15,00,000 కోట్ల) స్థాయిని చేరుకుంది. 2021-22లో ఐటీ పరిశ్రమ రెండంకెల వృద్ధి నమోదు చేస్తుందనేది నా అంచనా.
సవాళ్లు ఏమీ లేవా?