కెరియర్లో తాత్కాలిక విరామం అనంతరం ఉద్యోగం చేయాలనుకునే మహిళా అభ్యర్థులకు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) (Tcs Careers) శుభవార్త చెప్పింది. మహిళా నిపుణుల కోసం అతిపెద్ద 'రిక్రూట్‌మెంట్ డ్రైవ్'ను (Tcs Recruitment 2021) ప్రారంభించింది.
"ఓ వ్యక్తిలో నైపుణ్యాలు, సామర్థ్యం అనేవి ఎప్పుడూ ఉంటాయి. ప్రతిభావంతులైన, అనుభవజ్ఞులైన మహిళా నిపుణుల్లో స్ఫూర్తి నింపడమే కాకుండా.. వారిలోని టాలెంట్‌ను ఆవిష్కరించడానికి ఇదొక గొప్ప అవకాశం."
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
'వారికొక గుర్తింపు..'
'మహిళల్లోని ప్రత్యేక నైపుణ్యాలు ప్రపంచాన్ని మార్చగలవు. వారి ప్రతిభను టీసీఎస్ గౌరవిస్తుంది. ప్రతిభావంతులైన ఔత్సాహికుల కోసం ఈ ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని రూపొందించినట్లు' టీసీఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా తమ సంస్థలో అందుబాటులో ఉన్న పలు ఉద్యోగాల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది.
"ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచంలో నేర్చుకోవడం అనేది స్థిరంగా ఉంటుందని మేం నమ్ముతున్నాం. ప్రస్తుత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా.. మీ కెరియర్లో మరింత ప్రత్యేకంగా ఎదగడానికి ఇదో గొప్ప అవకాశం. అలాగే సామూహిక ఆవిష్కరణలు, జ్ఞానం ద్వారా గొప్ప భవిష్యత్తును నిర్మించాలని సంస్థ భావిస్తోంది. అందువల్ల మీ అనుభవం, ఆలోచనలు.. ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు వినూత్న మార్గాన్ని అందిస్తాయని టీసీఎస్ నమ్ముతోంది.''