తెలంగాణ

telangana

ETV Bharat / business

పన్ను ఆదా చేయాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మార్చి... ఆర్థిక సంవత్సరం చివరి నెల... పన్ను చెల్లింపుదారుల్లో కంగారు సృష్టించే మాసం... ఈ సమయంలో పన్ను చెల్లింపులతో పాటు ఆదాకు వివిధ మార్గాలను అన్వేషిస్తారు చెల్లింపుదారులు...

By

Published : Mar 21, 2019, 10:17 AM IST

ఆర్థిక సంవత్సరం

మార్చి 31 వస్తుందంటే చాలు పన్ను చెల్లింపు దారుల్లో ఒకటే హడావుడి. ఈ సమయంలోనే పన్ను పొదుపు చేయటానికి బీమా కొనుగోలుకు, పెట్టుబడులకు సిద్ధమవుతారు. ఇక్కడే తొందరపాటుతో తప్పులు చేస్తారు చాలామంది. పన్ను పొదుపు కోసం తమకు అవసరం లేని కొనుగోళ్లు జరుపుతారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఉపయోగపడే బీమా కొనుగోళ్లతో పాటు అధిక లాభాలనిచ్చే పెట్టుబడులు పెడుతూ పన్ను పొదుపు చేసుకోవచ్చు.

అవగాహన పెంచుకోవాలి:

పన్ను ఆదా చేసుకునేందుకు... ముందు ఏ బీమాలు కొంటే పన్ను పొదుపు పరిధిలోకి వస్తాయో తెలుసుకోవాలి. ఇంటి అద్దె, భవిష్య నిధి చెల్లింపులు, పిల్లల పాఠశాల ఫీజులు, కొన్ని రకాల ఆరోగ్య ఖర్చులు, ఇంతకు ముందు చేసిన పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్ను ఆదా పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మాత్రమే కొత్త కొనుగోళ్లు, పెట్టుబడులు జరపాలి.

గుడ్డిగా కొనుగోళ్లు, పెట్టుబడులు జరపకుండా మీ శాలరీ స్లిప్​, ఖాతా వివరాలు, చెల్లిస్తున్న పన్ను వివరాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి.

పన్ను ఆదాకు బీమా కొనుగోళ్లు జరపుతున్నారా...?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 80 కింద బీమా కొనుగోలు చేసిన వారికి ఆదాయపు పన్ను నుంచి కొంత మినహాయింపు ఉంటుంది. చాలా మంది ఈ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకోలేకపోతున్నారు.

కేవలం పన్ను ఆదా కోసమే కొందరు బీమా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇలా కాకుండా తమకు ఉపయోగపడే బీమాను కొనుగోలు చేస్తే అటు బీమా ప్రయోజనంతో పాటు, పన్ను ఆదా చేసుకోవచ్చు. ఒకసారి బీమా తీసుకునేటప్పుడు మీ కుటుంబానికి, మీకు దీర్ఘకాలంలో ఉపయోగపడే దాన్ని ఎంచుకుంటే మంచిది.

దీర్ఘకాల జీవిత బీమా పథకాలు ఎంచుకోండి:

జీవిత బీమా పథకాల్లో దీర్ఘకాల ఫలితాలనిచ్చేవే అధికంగా ఉంటాయి. భారత్​లో సమారు 66 శాతం జీవిత బీమా పథకాలు ఐదు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలపరిమితి కలిగినవేనని అంచనా. వీటిని ఎంచుకుంటే అటు పన్ను పొదుపుతో పాటు బీమా లాభాలు కూడా ఉంటాయి.

లక్ష్యం లేని పెట్టుబడి:

పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడి అయినా... మరేం చేసినా ఒక లక్ష్యమంటూ ఉండాలి. అయితే పెట్టుబడిదారులు పన్ను ఆదానే మొదటి ప్రాధాన్యంగా పొదుపు చేస్తారు. ఇది భవిష్యత్​లో అనేక ఇబ్బందులను సృష్టిస్తుంది. పెట్టుబడికి ఉపక్రమించే ముందు ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటే మంచి రాబడులు వస్తాయి.

దీర్ఘకాల పెట్టుబడులు:

పన్ను ఆదా కోసం పెట్టుబడిదారులు హడావుడిగా చేసే స్వల్పకాల పెట్టుబడుల వల్ల ఎలాంటి లాభం ఉండదు. మూడు, ఐదు సంవత్సరాలు ఉండే బీమా పథకాలు, భవిష్యనిధి పెట్టుబడులు లాంటి దీర్ఘ కాల పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు అధికంగా ఉంటాయి.

ఏ పథకానికి...ఎంత పన్ను ఆదా:

పన్ను చెల్లింపు దారులను వేధించే ప్రధాన సమస్యల్లో ఇదొకటి. కొన్ని పథకాలతో అధిక వడ్డీతో పాటు పన్ను ఆదా చేసుకోవచ్చు.

ఉదాహరణకు భవిష్యనిధిలో పొదుపు చేస్తే 8శాతం వడ్డీ లభించటమే కాక పన్ను ఆదా అవుతుంది. ఇలాంటి వాటిని ఎంచుకుంటే రాబడులు అధికంగా ఉంటాయి.

దరఖాస్తులు నింపే సమయంలో తొందరొద్దు:

చాలామంది పన్ను పొదుపు చేయటానికి ఏజెంట్లను అశ్రయిస్తారు. ఏజెంట్లు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేస్తారు. కానీ ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు.

ఉదాహరణకు... ఏజెంట్​ ఇచ్చిన బీమా ఫారాన్ని పూర్తిగా చదవకుండా సంతకం చేస్తే... ఒక్కోసారి అటు డబ్బుతో పాటు పన్ను కూడా ఆదా కాదు. ముందుగానే ఏవైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఏజెంట్లు ఇచ్చే ఫారాల్లో నిబంధనలు చదవకుండా సంతకాలు చేస్తే బీమా తిరస్కరణకు గురవుతుంది. అప్పుడు పన్ను ఆదా కాదు, కొనుగోలు చేసిన బీమా వ్యర్థమవుతుంది. అందుకే దరఖాస్తులు ఒకటికి రెండుసార్లు చదివిన తరువాత మాత్రమే సంతకాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏవైనా వ్యాధులు ఉంటే ఏజెంట్​కు ముందుగా చెప్పాలి. అప్పుడు తగిన పాలసీ సూచిస్తారు.

పన్ను చెల్లింపు, పన్ను ఆదా కోసం జరిపే కొనుగోళ్లు ప్రతి సంవత్సరం ఉండే పక్రియ. సంవత్సరం చివరిలో కంగారు పడే బదులు ముందుగానే ఈ కొనుగోళ్లు, పెట్టుబడుల తంతు పూర్తి చేస్తే చివర్లో హడావుడి పడాల్సిన అవసరం ఉండదు.

--- అదిల్​ శెట్టి, బ్యాంక్​ బజార్​.కామ్​ ముఖ్యకార్యనిర్వహణాధికారి

ABOUT THE AUTHOR

...view details