ఎయిరిండియా.. దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటా కొనుగోలు చేసిన టాటా సన్స్, దానితో పాటు తనకు వాటాలున్న విస్తారా, ఎయిరేషియా ఇండియా సంస్థలనూ లాభాల బాటలో పయనింప చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎయిరిండియా ఈ ఏడాది ఆఖరుకు టాటా సన్స్(Tata sons news today) ఆధీనంలోకి చేరుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే చౌక విమానయాన సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను(Air India and AirAsia merger), తమకు 84 శాతం వాటా కలిగిన ఎయిరేషియా ఇండియాను విలీనం చేయాలని టాటా సన్స్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎయిరేషియా ఇండియాలో మైనారిటీ వాటాదారైన ఎయిరేషియా బెర్హాద్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు వైదొలుగుతుందని, ఆ సంస్థ పూర్తిగా టాటాల పరమవ్వనుందని చెబుతున్నారు.
ఇదేవిధంగా పూర్తిస్థాయి సేవలందించే ఎయిరిండియా, తమకు 51 శాతం వాటా కలిగిన విస్తారా షెడ్యూళ్లను క్రమబద్దీకరించే విషయంలో విస్తారాలోని భాగస్వామ్య సంస్థ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో టాటాసన్స్(Tata Group airline merger) సంప్రదింపులు జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొత్తంమీద విమానయాన కార్యకలాపాలన్నీ ఒకే హోల్డింగ్ కంపెనీ కిందకు తెచ్చేందుకే టాటా సన్స్ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఒకే విధంగా కార్యకలాపాలు సాగించే సంస్థలను విలీనం చేయడం వల్ల ఇబ్బందులు రావని, పైగా వ్యయాలు కలిసొస్తాయన్నది టాటా సన్స్(Tata Group news) ఆలోచనగా చెబుతున్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిరేషియా ఇండియాలు రెండూ చౌక విమానయాన సంస్థలే. యాజమాన్య వాటాల దృష్ట్యా చూసినా, వీటిని ఒకే సంస్థగా మార్చడం టాటా సన్స్‌కు సులభమే. ఇరు సంస్థల సిబ్బందిని సమన్వయం చేసుకోవడం, విమానాల నాణ్యత-భద్రతా పరీక్షల వంటి అంశాల్లో ఐక్యత సాధించేందుకు ఆయా సంస్థల ఉన్నతాధికారులతో ఇప్పటికే టాటా సన్స్ పలుమార్లు చర్చలు జరుపుతున్నారని తెలిసింది. సంస్థలను విలీనం చేయడంలో అంతర్జాతీయంగా ప్రావీణ్యం కలిగిన అనుభవజ్ఞులు ఈ ప్రక్రియలో ఉన్నారని చెబుతున్నారు.