తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటాలకు ఎయిరిండియా అప్పగింత నేడే! - టాటాలకు ఎయిర్ ఇండియా అప్పగింత

TATA Air India News: దాదాపు 7దశాబ్దాల తర్వాత ఎయిరిండియా మళ్లీ టాటాగ్రూప్‌ కంపెనీగా మారనుంది. స్వదేశీ విమానాయాన సంస్థలో వందశాతం వాటాను విక్రయించిన కేంద్ర ప్రభుత్వం నేడు టాటాలకు అప్పగించనుంది. ఈమేరకు లాంఛనాలన్నీ పూర్తి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Air India
ఎయిర్ ఇండియా

By

Published : Jan 27, 2022, 5:19 AM IST

TATA Air India News: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా దాదాపు 7 దశాబ్దాల తర్వాత తిరిగి టాటాల చేతికి వెళ్లనుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం బిడ్డింగ్‌ నిర్వహించింది. టాటా అనుబంధ సంస్థ టాలెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అత్యధికంగా 18 వేల కోట్లకు బిడ్డింగ్‌ వేసి ఎయిరిండియాను తిరిగి దక్కించుకుంది. విక్రయ ఒప్పందానికి గతేడాది అక్టోబరు 8న ఆమోదం తెలిపిన కేంద్రం ఆ తర్వాత 3 రోజులకు అంగీకారం తెలుపుతూ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేసింది. అక్టోబరు 25 న విక్రయం ఒప్పందంపై సంతకం చేసిన కేంద్రం.. టాటాలకు అప్పగించేందుకు లాంఛనాలన్నీ పూర్తి చేసింది.

ఒప్పందంలో భాగంగా ఎయిరిండియాతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలు అందించే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, ఎయిరిండియా శాట్స్ లో 50శాతం వాటా కూడా టాటా గ్రూప్‌ కు అందజేయనుంది. ఎయిరిండియా కొనుగోలుతో టాటాగ్రూప్​ లో మూడో విమానయాన సంస్థగా అవతరించనుంది. ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియాలో టాటాలకు మెజారిటీ వాటాలున్నాయి. ఎయిరిండియా నిర్వహణ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేయాలనే ఆలోచనతో టాటా గ్రూప్‌ ఉన్నట్లు సమాచారం.

ఈ కొనుగోలు ఒప్పందం ద్వారా దాదాపు ఏడు 7 దశాబ్దాల తర్వాత ఎయిరిండియా మళ్లీ టాటా గ్రూప్‌ అధీనంలోకి వెళ్లనుంది. 89ఏళ్లక్రితం 1932 లో జేఆర్​డీ టాటా.... టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ ప్రారంభించారు. 1953లో జాతీయకరణలో భాగంగా టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవటంతో ఎయిరిండియాగా మారింది. విమానయాన రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించాక ఎయిరిండియా క్రమంగా తన మార్కును కోల్పోవటం మొదలైంది. 2007-08లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌తో విలీనం అనంతరం నష్టాలు మొదలయ్యాయి. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా విక్రయానికి ప్రభుత్వం బిడ్డింగ్‌ నిర్వహించగా టాటాలు దక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details