ఎయిర్ ఇండియా కొనుగోలుకు బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెలతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో టాటాసన్స్ బిడ్ దాఖలు చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టాటాసన్స్‌కు విమానయాన రంగంలో వ్యాపారాలు ఉన్నాయి. దీనికి తోడు స్టీల్, ఆటోమొబైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో కూడా మంచి పేరుంది.
'దీనిలో మరొక భాగస్వామిని చేర్చుకొనే ప్రతిపాదన ఏదీ లేదు' అని టాటా సన్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించడం గమనార్హం.
ప్రస్తుతం టాటాసన్స్ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఓ అంచనాకు వచ్చే పనిలో ఉంది. మార్చి 2019 నాటికి ఎయిర్ ఇండియాకు దాదాపు 7.78 బిలియన్ డాలర్ల రుణం ఉంది. ప్రభుత్వం కూడా చేతులెత్తేయడం వల్ల విక్రయం ఖాయమైంది.
ఈ కంపెనీని కొనుగోలు చేసేవారు కచ్చితంగా 3.10 బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంటుందని.. మిగిలినది ఎస్‌పీవీకి బదిలీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 2018లోనే దీనిని విక్రయించాలని ప్రయత్నించినా ప్రభుత్వం విఫలమైంది. మరోసారి ఈ ఏడాది ప్రయత్నించగా కొవిడ్ కారణంగా జాప్యం జరిగింది.
ఇదీ చూడండి:ఆర్బీఐ నుంచి కేంద్రానికి రూ.57 వేల కోట్లు