Tata Play: దేశంలో 23 మిలియన్ల మంది వినియోగదారులకు చేరువైన టాటా స్కై పేరును టాటా ప్లేగా మార్చారు. స్మార్ట్ టీవీలలో డైరెక్ట్‌గా OTTయాప్స్‌ను యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా టాటా ప్లేగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. టాటా ప్లే ద్వారా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సహా 13 OTT యాప్స్‌ను స్మార్ట్ టీవీలలో యాక్సెస్ చేసుకోవచ్చు. దీని కోసం టాటా ప్లే బింజ్ కాంబో ప్యాక్స్‌ను తీసుకొచ్చింది.
టాటా ప్లే తమ కొత్త సేవలను నెలకు రూ.399తో ఆరంభించింది. రీఛార్జ్ చేయకుండా కొన్నాళ్ల పాటు వాడకపోయినా మళ్లీ రీఛార్జ్ చేసుకొని టాటా ప్లే సర్వీసులను వాడుకోవచ్చు. అలాగే సర్వీస్ విజిట్ ఛార్జీలను కూడా ఎత్తేసినట్లు టాటా ప్లే సీఈవో హరిత్ నాగ్‌పాల్ తెలిపారు. సర్వీస్ విజిట్ రుసుము రూ.175 రద్దు చేశామని, ఇప్పటివరకు DTH కనెక్షన్ రీఛార్జ్ చేసుకోని కస్టమర్లకు ఉచితంగానే రీ కనెక్షన్ ఇస్తామని తెలిపారు. భవిష్యత్తు మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని టాటా ప్లే వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడానికే ఈ మార్పులు చేసినట్లు నాగ్‌పాల్ తెలిపారు. సబ్‌స్కైబర్లు OTT వేదికలకు అలవాటు పడుతున్నారని అందుకే వారి కోసం ఒక ఏకరూప వేదికను తీసుకొచ్చి సేవలు అందించాలని నిర్ణయించామని తెలిపారు. DTH సేవలతో పాటుగా బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ పేరును కూడా టాటా ప్లే ఫైబర్‌గా మార్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది.