తెలంగాణ

telangana

ETV Bharat / business

తొలి త్రైమాసికంలో దుమ్మురేపిన టీసీఎస్ - టీసీఎస్ సీఈఓ వార్తలు

దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ లాభాల్లో దుమ్మురేపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో.. రూ.9,008 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 28.5 శాతం వృద్ధితో.. మొత్తం రూ.45,411 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

tcs
క్యూ1 లాభాల్లో దుమ్మురేపిన టీసీఎస్

By

Published : Jul 8, 2021, 8:46 PM IST

Updated : Jul 9, 2021, 3:02 PM IST

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 28.5% వృద్ధి చెంది రూ.9008 కోట్లకు చేరింది. 2020-21 జూన్‌ త్రైమాసిక నికర లాభం రూ.7008 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ఆదాయం కూడా రూ.38,322 కోట్ల నుంచి 18.5% పెరిగి రూ.45,411 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలోనే 810 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లను కంపెనీ దక్కించుకుందని టీసీఎస్‌ సీఎఫ్‌ఓ సమీర్‌ సెక్సారియా తెలిపారు.

ఉద్యోగులు@5 లక్షలు..

జూన్‌ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో నికరంగా 20,409 మంది ఉద్యోగులను చేర్చుకోవడంతో 2021 జూన్‌ 30 నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 5 లక్షల మైలురాయిని అధిగమించి 5,09,058కు చేరింది. వలసల రేటు 8.6 శాతంగా నమోదైంది. పరిశ్రమలోనే ఇదే అత్యల్పమని కంపెనీ తెలిపింది. 2021-22లో కంపెనీ 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది. ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు, పదోన్నతులు అమలు చేసినట్లు సంస్థ తెలిపింది.

'కష్టకాలంలో ఉద్యోగులు పరస్పరం సహకారం ఇచ్చిపుచ్చుకుని అద్భుతంగా పనిచేశారు. ఖాతాదారుల ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేశారు. ఉత్తర అమెరికా వ్యాపారం, బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌ విభాగాలు మంచి వృద్ధి సాధించాయి. ఒక త్రైమాసికంలో 600 కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించాం. మా నిర్వహణ మోడల్‌, అందిస్తున్న ఉత్పత్తుల ప్రత్యేకత, భాగస్వాముల కార్యదక్షత వల్లే ఇది సాధ్యమైంది. కీలక మార్కెట్లు, విభాగాల్లో అవకాశాలపై ఆశావహంగా ఉన్నాం. కొవిడ్‌ మూడో దశ భయాల నేపథ్యంలో పరిస్థితిని కంపెనీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రైవేటు రంగంలో అత్యంత భారీగా టీకా ప్రక్రియ చేపట్టాం. '

- రాజేశ్‌ గోపీనాధన్‌, సీఈఓ, ఎండీ టీసీఎస్‌

  • ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులను కలిగిన రెండో సంస్థగా టీసీఎస్‌ అవతరించింది. అంతర్జాతీయంగా చూస్తే.. అసెంచర్‌కు మాత్రమే 5.37 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. దేశీయంగా ఇన్ఫోసిస్‌లో 2.5 లక్షలు, విప్రోలో 1.9 లక్షలు, హెచ్‌సీఎల్‌ టెక్‌లో 1.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
  • దేశీయంగా భారతీయ రైల్వే తర్వాత టీసీఎస్‌లోనే అత్యధిక ఉద్యోగులున్నారు. రైల్వేలో 10 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేట్‌ దిగ్గజాల్లో ఎల్‌ అండ్‌ టీలో 3.37 లక్షల మంది, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 2 లక్షల మంది, ఆదిత్య బిర్లా గ్రూప్‌లో 1.2 లక్షల మంది పనిచేస్తున్నారు. దేశీయ ప్రైవేటురంగంలో అత్యధిక ఉద్యోగులను కలిగిన సంస్థగా టీసీఎస్‌ నిలిచింది.
  • కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతి వల్ల దేశీయ వ్యాపారం మందగించి, మొత్తం కంపెనీ వృద్ధిని వెనక్కి లాగిందని టీసీఎస్‌ తెలిపింది. భారత వ్యాపారం 14% తగ్గి రూ.2085 కోట్లకు పరిమితమైంది. అమెరికా వంటి కీలక విపణుల్లో ఆకర్షణీయ వృద్ధి సాధించగా, బ్యాంకింగ్‌, దేశీయ వ్యాపారాలు నిరాశపరిచాయని వెల్లడించింది. కొవిడ్‌ రెండో దశ వల్ల పాస్‌పోర్టుల జారీ, టీసీఎస్‌ అయాన్‌ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ వంటివి స్తంభించి, రూ.350 కోట్ల ఆదాయం తగ్గినట్లు వివరించింది.
  • సీజనల్‌ ప్రభావంతో ఆపరేటింగ్‌ మార్జిన్‌ 25.5 శాతానికి తగ్గింది. అయితే 26-28 శాతాన్ని అందుకుంటామని విశ్వాసం వ్యక్తం చేసింది.

రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.7 (700%) డివిడెండును డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. బీఎస్‌ఈలో గురువారం టీసీఎస్‌ షేరు 0.56% నష్టంతో రూ.3257.10 వద్ద ముగిసింది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 9, 2021, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details