వచ్చే ఐదేళ్లలో దేశంలో రూ.100 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి (డీఈఏ) అథాను చక్రవర్తి ఛైర్మన్‌గా ఓ ఇంటర్ మినిస్ట్రియల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
ఈ టాస్క్‌ఫోర్స్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యాచరణపై 2019 అక్టోబర్ 31లోగా నివేదిక అందించనుంది. అలాగే 2021-25 ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టాల్సిన పనులపై నివేదికను డిసెంబర్ 31లోపు అందించనుంది.
100 లక్షల కోట్లతో..
జాతీయ మౌలిక సదుపాయాల కల్పనగా పేర్కొంటున్న ఈ ప్రణాళికలో గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులకు రూ.100 కోట్లకు మించి ఖర్చు చేస్తారు.
టాస్క్‌ఫోర్స్... సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యమయ్యే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తుంది. అలాగే వచ్చే ఐదేళ్లలో (2021-25 ఆర్థిక సంవత్సరాలు) చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌ల జాబితాను రూపొందిస్తుంది.