భారత ప్రభుత్వం స్విస్ బ్యాంకు అందించిన డేటా ఆధారంగా అక్రమ ఖాతాల వివరాలు విశ్లేషించడానికి సమాయత్తమవుతోంది. 2018 సంవత్సరానికి సంబంధించిన ఈ సమాచారాన్ని ఇప్పటికే ప్రాథమికంగా పరిశీలించిన బ్యాంకర్లు, నియంత్రణ అధికారులు.. అధిక శాతం ఖాతాలు ఇప్పటికే మూతపడ్డాయని గుర్తించారు.
స్విట్జర్లాండ్ - భారత్ చేసుకున్న ఒప్పందం మేరకు.. ఈ నెలలో స్వయంచాలక సమాచార మార్పిడి పద్ధతి (ఏఈఓఐ) ద్వారా 2018 సంవత్సరానికి సంబంధించిన ఖాతాల వివరాలు దిల్లీకి చేరాయి.
'మూలాలు తెలుసుకుంటాం...'
స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడి అన్ని బ్యాంకులు తమ వద్ద ఉన్న భారత పౌరుల ఖాతాల వివరాలు వెల్లడించాయి. వీటి ద్వారా భారతీయుల డిపాజిట్లు, సెక్యూరిటీలు, నగదు బదిలీలు, ఇతర పెట్టుబడుల సమాచారం తెలుసుకునే అవకాశముందని బ్యాంకర్లు భావిస్తున్నారు.
అక్రమంగా స్విస్ బ్యాంకుల్లో లెక్కలేనంత సంపద దాచుకున్నవారిపై.. కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. స్విస్ ఖాతాలు ఉన్న రాజకీయ నేతల గుట్టు విప్పడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని తెలిపారు.