Swiggy IPO: ఆహార పదార్థాలను డెలివరీ చేస్తున్న స్విగ్గీ 80-100 కోట్ల డాలర్ల (రూ.6,000-7,500 కోట్ల) పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. ఈ ఐపీఓ కోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్‌లను నియమించుకుందని తెలుస్తోంది. త్వరలోనే మర్చంట్ బ్యాంకర్లను కూడా నియమించుకోబోతోందని సమాచారం.
ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 10% వాటా విక్రయించబోతోంది. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ పెట్టుబడులున్న స్విగ్గీ విలువ జనవరి నుంచే రెండింతలు పెరిగి 10.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.80,000 కోట్లు) చేరింది. అసెట్ మేనేజర్ ఇన్వెస్కోతో పాటు బారన్ క్యాపిటల్ గ్రూప్, సుమేరు వెంచర్స్, ఐఐఎఫ్‌ఎల్ ఏఎంసీ లేట్ స్టేజ్ టెక్ ఫండ్, కోటక్ తదితర సంస్థలు గత సిరీస్ ఫండింగ్‌లో 70 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,250 కోట్లు) పెట్టుబడులు చొప్పించాయి.