'కరోనా' వైరస్ వ్యాధి ప్రజల ప్రయాణపు అలవాట్లలో ఎంతో మార్పు తెస్తోంది. ప్రజా రవాణా కంటే సొంతగా ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. ఇందువల్ల చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలకు గిరాకీ పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్లుగా తెలుగు రాష్ట్రాల్లో కార్లు, ద్విచక్ర వాహన షోరూమ్‌లు సందర్శించే వారు అధికంగా కనిపిస్తున్నారు. ఆన్‌లైన్లో లేదా ఫోన్ ద్వారా విచారించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే వరస కొనసాగితే వచ్చే నెల నాటికి పూర్తి సాధారణ స్థితికి చేరుకుంటామని వాహన్ కంపెనీల స్థానిక ప్రతినిధులు, డీలర్లు పేర్కొంటున్నారు.
ఫోన్లలో వివరాలు అడుగుతున్నారు..
తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు/ నగరాలోని వాహన షోరూమ్‌లకు.. ఏ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి, రాయితీ ఇస్తున్నారా.. రుణం వెంటనే వస్తోందా.. అని ఫోన్ల ద్వారా అడగటం ఎక్కువయ్యింది. చిన్న కార్లకు సంబంధించిన ఆరా అధికంగా ఉన్నట్లు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టయోటా డీలర్లు వివరిస్తున్నారు. బడ్జెట్ మోటార్ సైకిళ్ల కోసం వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని ద్విచక్ర వాహన డీలర్ ఒకరు చెప్పారు. ఎటువంటి వాహనం లేని వారు ద్విచక్ర వాహనం కొనాలని చూస్తుంటే, అది ఉన్న వారు కుటుంబం మొత్తం వెళ్లటానికి వీలుగా కారు కొనాలని ఆశిస్తున్నారు. అందుకే చిన్న కార్లకు అధిక గిరాకీ కనిపిస్తోంది. అందువల్ల వాహన అమ్మకాలు త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. 'కరోనా' ముందు మా షోరూమ్‌కు రోజుకు 80 -100 మంది వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 50 నుంచి 60 వరకూ వచ్చింది. వచ్చే నెల నాటికి 'కరోనా' ముందు నాటి స్థితికి చేరుకోగలం- అని హైదరాబాద్‌లోని ఒక కార్ల డీలర్ వివరించారు.
పెరగనున్న 'డిజిటల్' అమ్మకాలు..
గతంలో మాదిరిగా కొనుగోలుదార్లు షోరూమ్‌లకు వెళ్లటం, టెస్ట్ డ్రైవ్‌లు చేయటం వంటివి తగ్గవచ్చు. దీనికి బదులుగా తాము ఎంచుకున్న కారు మోడల్ సమాచారాన్ని ఇంటర్నెట్‌లో వెతుక్కొని, ఆన్‌లైన్లో బుక్ చేసుకునే పద్ధతి పెరుగుతుందని అంచనా.