తెలంగాణ

telangana

ETV Bharat / business

చక్రవడ్డీ మాఫీలో జాప్యంపై సుప్రీం అసంతృప్తి - మారటోరియంపై సుప్రీం విచారణ

మారటోరియం సమయంలోని చక్రవడ్డీ మాఫీ అమలులో.. జాప్యంపై కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక అమలు చేయటానికి ఆలస్యం ఎందుకని అడిగింది. రుణాలు ఇవ్వడంలో వైవిధ్యమైన పద్ధతులు ఉంటాయని.. ఫలితంగా బ్యాంకులతో సంప్రదింపులు జరిపినట్లు కోర్టుకు వివరించింది కేంద్రం.

maratorium
సుప్రీం

By

Published : Oct 14, 2020, 4:55 PM IST

మారటోరియం కాలంలో చక్రవడ్డీ మాఫీ అమలులో జరుగుతున్న జాప్యంపై.. సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరటోరియంపై జస్టిస్‌ అశోక్ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ అమలుపై కేంద్రాన్ని ప్రశ్నించింది న్యాయస్థానం. మాఫీపై నిర్ణయం తీసుకున్నామని, ఇంకా అమలు చేయలేదని సోలిసిటరీ జనరల్ జీసీ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.

ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై స్పందించిన మెహతా.. రుణాలు ఇవ్వడంలో వైవిధ్యమైన పద్ధతులు ఉంటాయని.. ఫలితంగా బ్యాంకులతో సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. అందువల్లే ఆలస్యం అయిందని పేర్కొన్నారు.

మాఫీ నిర్ణయం అమలుపై సామాన్యుల్లో ఆందోళన ఉందన్న ధర్మాసనం... సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపింది.

తదుపరి విచారణ సమయానికి చక్రవడ్డీ మాఫీ అమలులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తామని అటు బ్యాంకుల తరపున హాజరైన న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు నివేదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను నవంబర్ 2కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:'చక్రవడ్డీ మాఫీకి ఓకే.. మారటోరియం పొడిగింపే కష్టం'

ABOUT THE AUTHOR

...view details