తెలంగాణ

telangana

ETV Bharat / business

సుందర్​కు షాక్​: ఆల్ఫాబెట్​కు లాభాలొచ్చినా నిరాశే - ఆల్ఫాబెట్​

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ నాల్గో త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. 2019 చివరి మూడు నెలల్లో 10.7 బిలియన్​ డాలర్లు లేదా షేరుకు 15.35 డాలర్లు సంపాదించింది. అయితే వాల్​స్ట్రీట్ ఊహించిన స్థాయిలో సంస్థ ఆదాయం పెరగలేదు.

Google parent Alphabet posts mixed 4Q results; profit soars
సుందర్​కు షాక్​: ఆల్ఫాబెట్​కు లాభాలొచ్చినా నిరాశే

By

Published : Feb 4, 2020, 1:17 PM IST

Updated : Feb 29, 2020, 3:26 AM IST

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ నాల్గో త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. గూగుల్ ఆదాయం వాల్​ స్ట్రీట్​ ఊహించినంతగా పెరగలేదు.

ఆల్ఫాబెట్​ 2019 చివరి మూడు నెలల్లో 10.7 బిలియన్​ డాలర్లు లేదా షేరుకు 15.35 డాలర్లు సంపాదించింది. గతేడాది ఇదే సమయంలో ఆల్ఫాబెట్ 8.9 బిలియన్ డాలర్లు లేదా షేరుకు 12.77 డాలర్లు ఆర్జించింది. అంటే గతేడాదితో పోల్చితే 19 శాతం వృద్ధి నమోదైంది. ఇది ఫాక్ట్​సెట్ పోల్​ విశ్లేషకులు అంచనా వేసిన 12.49శాతం కంటే ఎక్కువ.

ప్రకటనల ఖర్చు తీసివేసిన తరువాత సంస్థ నికర ఆదాయం 37.6 బిలియన్ డాలర్లు. ఇది గతేడాది వచ్చిన నికర ఆదాయం 31.8 బిలియన్ డాలర్ల కంటే 18 శాతం ఎక్కువ. అయితే ఆల్ఫెబెట్... విశ్లేషకులు ఊహించిన 38.4 బిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని సాధించలేకపోయింది.

గట్టిపోటీ..

డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్లో ఇప్పటికీ గూగుల్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ... ఫేస్​బుక్, అమెజాన్​ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోంది.

ఆల్ఫాబెట్, గూగుల్​... వెబ్​, యాప్స్​, సెర్జిఇంజిన్​, యూట్యూబ్​లో ఉత్పత్తుల ప్రకటనల ద్వారానే అత్యధికంగా ధనాన్ని ఆర్జిస్తున్నాయి. ఇప్పుడు క్లౌడ్ బిజినెస్, ఆరోగ్య రంగంలోకి ప్రవేశించాలన్న గూగుల్​ ప్రయత్నాలను మదుపరులు నిశితంగా గమనిస్తున్నారు. ఆరోగ్య రంగానికి సంబంధించి... ఫిట్​నెస్ ట్రాకర్ సంస్థ ఫిట్​బిట్​ను నవంబర్​లో కొనుగోలు చేయడానికి గూగుల్ ఇప్పటికే అంగీకరించింది.

మొదటిసారిగా

యూట్యూబ్​, క్లౌడ్ బిజినెస్​ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆల్ఫాబెట్ మొదటిసారి వెల్లడించింది. ఈ ఏడాది యూట్యూబ్​ ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం గతేడాది ఉన్న 3.61 బిలియన్​ డాలర్ల నుంచి 31 శాతం పెరిగి 4.72 బిలియన్ డాలర్లకు చేరుకుందని స్పష్టం చేసింది. గూగుల్ క్లౌడ్​ ఆదాయం గతేడాది ఉన్న 1.71 బిలియన్ డాలర్ల నుంచి 53 శాతం పెరిగి 2.61 బిలియన్ డాలర్లకు పెరిగిందని వెల్లడించింది.

2019 డిసెంబర్​లో ఆల్ఫాబెట్ వ్యవస్థాపకులు లారీ పేజ్​, సెర్గీ బ్రిన్​... సంస్థ బాధ్యతలను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్​కు అప్పగించారు. పిచాయ్ ఆల్ఫాబెట్​ బాధ్యతలు చేపట్టిన తరువాత వెలువరించిన మొదటి ఆదాయ నివేదిక ఇదే.

ఇదీ చూడండి: 'ప్రపంచమంతా కరోనా​కు వ్యతిరేకంగా పోరాడాలి'

Last Updated : Feb 29, 2020, 3:26 AM IST

ABOUT THE AUTHOR

...view details