కరోనా కారణంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను ప్రగతి రథంలో నడిపేందుకు కేంద్రం రూ.20 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను(ఎస్ఎంఈ) ఆదుకునేందుకు 6 ప్రత్యేక పథకాలను తీసుకొచ్చారు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్. రూ.3లక్షల కోట్ల వడ్డీలేని రుణాలను ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే వీటిని సకాలంలో సక్రమంగా అమలు చేయాలంటే బ్యాంకులు, ప్రభుత్వశాఖల పాత్ర కీలకమని అభిప్రాయపడున్నారు ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు చంద్రకాంత్ సాలుంఖే.
"ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ బాగుంది. అయితే ఇది ఏ మేరకు విజయవంతమవుతుందనే విషయం బ్యాంకులు, ప్రభుత్వశాఖలపైనే ఆధారపడి ఉంది."
-ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు చంద్రకాంత్ సాలుంఖే.
ఉద్దీపన చర్యల్లో భాగంగా ఎంఎస్ఎంఈల నిర్వచనంలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు నిర్మల. పరిశ్రమల పెట్టుబడి పరిమితిని పెంచారు. ఇది వరకు 25 లక్షల పెట్టుబడి పెట్టే తయారీ రంగ పరిశ్రమను ఎంఎస్ఎంఈగా పరిగణించగా.. ఈ పరిమితిని కోటికి పెంచారు. రూ. కోటి, రూ.50కోట్లు, రూ.100కోట్ల టర్నోవర్ ఉన్న పరిశ్రమలను సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా గుర్తించనున్నట్లు చెప్పారు. ఎంఎస్ఈల డిమాండ్లను మాత్రం నెరవేర్చలేకపోయారు.
రూ. 5కోట్లు, రూ.75కోట్లు, రూ.250 కోట్ల టర్నోవర్ ఉన్న పరిశ్రమలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహాగా గుర్తించాలని తాము సూచించినట్లు సాలుంఖే తెలిపారు. ఈ విషయంపై కొంత నిరాశ చెందినట్లు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే ఎస్ఎంఈ నిర్వచణం కూడా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.