తెలంగాణ

telangana

ETV Bharat / business

రానున్నది మరింత 'స్మార్ట్​' కాలం..! - technology news

మనిషి ప్రతీ అవసరం, అవకాశంలో సాంకేతికత అంతర్భాగమైంది. టెక్నాలజీ అనేది మన జీవితాల్లో అంతగా చొచ్చుకుపోయింది. రాబోయే రోజుల్లో అది మరింత ఎక్కువ కావొచ్చు. అయితే గతేడాదితో పోల్చితే సాంకేతికత విషయంలో వచ్చే మార్పులేంటో ఓ సారి పరిశీలిద్దాం..

story about changes in technology in the coming days
స్మార్ట్‌ మంత్రం పలుకుతోంది!

By

Published : Jan 3, 2021, 6:58 AM IST

కరోనా.. ఇది మన జీవితంలో చొచ్చుకుపోయింది. ఇది ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా కఠోర వాస్తవం. అంతలా సాంకేతికత కూడా మనలో అంతర్భాగమైంది. ప్రతీ అవసరం, అవకాశంలో అది కనిపిస్తోంది. గతేడాది కంటే ఈ కొత్త సంవత్సరంలో అది మరింతగా మన జీవితాల్లో చొచ్చుకుపోవచ్చు. కనీవినీ ఎరుగని మార్పులు చోటు చేసుకోవచ్చు. అవేంటో చూద్దామా?

వినియోగదార్ల మనసును చదివేస్తారు!!

వినియోగదార్లు ఎప్పుడు ఎలా స్పందిస్తారు. వారి ధోరణి ఎలా మారుతుంటుంది అనేది కనిపెట్టే సాంకేతికత వస్తోంది. ఇప్పటికే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డివైజెస్‌, టెక్‌ ప్లాట్‌ఫాంల ద్వారా వినియోగదార్ల మనసును చదివే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇంటర్నెట్‌ ఆప్‌ థింగ్స్‌ అంటే వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి.. ఒక వినియోగదారుడి ధోరణికి సంబంధించిన పాటర్న్‌ను రూపొందిస్తారు.

ఇలా మార్పు:

ఇంటర్నెట్‌ ఆఫ్‌ బిహేవియర్స్‌ ద్వారా ప్రస్తుత సాంకేతికత అయిన-ఫేషియల్‌ రికగ్నిషన్‌, లొకేషన్‌ ట్రాకింగ్‌, బిగ్‌ డేటాను నగదు కొనుగోళ్లు, పరికరాల వినియోగం వంటి ధోరణులకు సంబంధించిన డేటాతో అనుసంధానం చేస్తారు.

ఆకాశంలో సర్వర్లు

క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో కార్యాలయ నిర్వచనం మారిపోయే అవకాశం ఉంది. ఎక్కడో రిమోట్‌ సర్వర్‌లో సమాచారాన్ని దాచుకునే సంప్రదాయం ఇపుడు పెరుగుతోంది. భారత్‌లో, అంతర్జాతీయంగా కొన్ని కీలక కారణాల వల్ల ప్రైవేటు క్లౌడ్‌ సేవలకు గిరాకీ పెరుగుతోంది. కంపెనీలకు సంబంధించిన డేటాను రక్షించుకోవడం; తన స్టోరేజీలకు సంబంధించిన హక్కులను సంరక్షించుకోవడం అత్యంత అవసరంగా మారుతోంది.

ఇలా మార్పు:

కంపెనీ ఒక చోట ఉంటే మరో చోట ఎక్కడో కంపెనీకి సంబంధించిన సర్వర్‌లో సమాచారం భద్రంగా ఉంటుంది. దాని వల్ల కంపెనీకి చెందిన సునిశిత సమాచారం బయటకు వెళ్లకుండా ఉంటుంది. కరోనా సమయంలో బిజినెస్‌ క్లౌడ్‌కు గిరాకీ పెరిగింది. చాలా వరకు కంపెనీలు తమ సర్వర్లను అలా క్లౌడ్‌కు తరలించాయి.

రోబోలు సరికొత్తగా..

సాధారణంగా భౌతికంగా కనిపించే రోబోలను ఆటోమేషన్‌తో కలగలిపి రోబోటిక్‌ప్రాసెస్‌ ఆటోమేషన్‌(ఆర్‌పీఏ) అనే కొత్త ప్రక్రియ మొదలైంది. దీని వల్ల చిన్న కంపెనీలు సైతం ఉద్యోగులు, మౌలిక వసతులపై తక్కువ పెట్టుబడులు పెట్టి.. వేగంగా వృద్ధి చెందేందుకు వీలు కలుగుతోంది. ఆటోమేషన్‌ అనే సేవకు రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యం లభించనుంది.

ఇలా మార్పు:

సాఫ్ట్‌వేర్‌ రోబోలు లేదా ఆర్‌పీఏలు కీలకంగా మారి డిజిటల్‌ మార్పును వేగవంతం చేయనున్నాయి. కరోనా వల్ల ఈ ఆర్‌పీఏ వైపు పలు కంపెనీలు మళ్లాయని గార్టనర్‌ అంటోంది. 2022 కల్లా అంతర్జాతీయంగా 90 శాతం పెద్ద కంపెనీలు ఆర్‌పీఏను అందిపుచ్చుకోవచ్చని అంచనా వేస్తోంది.

భద్రత.. మరింత భద్రంగా

రిమోట్‌ కంప్యూటింగ్‌, క్లౌడ్‌కారణంగా సైబర్‌ భద్రత కూడా అత్యంత అవసరంగా మారింది. అయితే సంస్థల కంటే వినియోగదార్లకు సంబంధించిన సైబర్‌భద్రతలో మరో విప్లవం కనిపించేందుకు అవకాశం ఉంది. ఒక వ్యక్తి గుర్తింపు అనేది ఒక పరిధి దాటి బయటకు వెళ్లకుండా చేయడం అత్యంత కీలకంగా మారనుంది. మొబైల్‌లో ఉండే సమాచారం బయటకు వెళ్లకుండా చేసే సైబర్‌ భద్రతకు అత్యంత గిరాకీ ఉండనుందని.. 2025 కల్లా అది 13 బి. డాలర్లకు చేరొచ్చని పరిశోధన సంస్థలు చెబుతున్నాయి.

ఇలా మార్పు:

సైబర్‌ సెక్యూరిటీ మెష్‌ ద్వారా వ్యక్తి లేదా సర్వర్‌ ఎక్కడ ఉన్నా.. ప్రతి వ్యక్తి ఏదైనా డిజిటల్‌ అసెట్‌ను అత్యంత భద్రమైన పద్ధతిలో పొందుతారు. వీటికీ భవిష్యత్‌ కనిపిస్తోంది.

ఇవి కూడా:

  • ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత:ప్రైవసీ ఎన్‌హాన్సింగ్‌ కంప్యూటేషన్‌ ద్వారా డేటాను సంరక్షించుకునే ధోరణి పెరగనుంది.
  • ఎక్కడి నుంచైనా కార్యకలాపాలు:కరోనా వల్ల రిమోట్‌ ప్రాంతాల్లో ఉండి ఆఫీసు కార్యకలాపాలు, వర్క్‌ ఫ్రం హోం మొదలు కాగా.. అవి మరింత కాలం, మరింత సాంకేతికతతో, మరింత సులువుగా కొనసాగవచ్చు.
  • వర్చువల్‌ ప్రపంచం:భౌతిక ప్రపంచానికి సమాంతరంగా ఒక వర్చువల్‌ ప్రపంచం ఇప్పటికే మొదలైంది. అది మరింత బలంగా, విస్తృతంగా మారే అవకాశం కనిపిస్తోంది.
  • 5జీ నెట్‌వర్క్‌ అనుసంధానం:2021 చివరి కల్లా పబ్లిక్‌ వైఫై హాట్‌స్పాట్లు కోటికి చేరనున్నాయి. వీటితో వ్యక్తుల మధ్య అనుసంధానం భారీగా పెరగనుంది. అలాగే 2021 అనేది 5జీ ఏడాదిగా మారనుంది. అవి అందుబాటులోకి వస్తే మొబైల్‌ డేటా వినియోగం, వేగం భారీగా పెరగనుంది. 2021లో విక్రయమయ్యే స్మార్ట్‌ఫోన్లలో 10 శాతం 5జీ సాంకేతికతతో పనిచేసేవే ఉంటాయని అంచనాలు వెలువడుతున్నాయి.

ఇదీ చదవండి: 'విజయవంతంగా కరోనా కొత్త వైరస్​ వృద్ధి'

ABOUT THE AUTHOR

...view details