వారాంతంలో స్టాక్ మార్కెట్లు(Stock Market today) నష్టాలతో ముగిశాయి. లాభాలతో ప్రారంభమైన శుక్రవారం సెషన్.. తర్వాత అమ్మకాల వెల్లువెత్తడం వల్ల సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. దీనికితోడు ప్రతికూల అంతర్జాతీయ పరిణామాలు, మదుపర్ల లాభాల స్వీకరణ మార్కెట్లను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 102 పాయింట్లు కోల్పోయి.. 60,821 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి..18,114 వద్ద ముగిసింది.
స్థిరాస్తి, బ్యాంకింగ్ రంగాలు మినహా.. ఐటీ, లోహ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ సహా దాదాపు అన్ని రంగాల సూచీలు 1-3 శాతం నష్టపోయాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్(Stock Market today) ఉదయం 61,044 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే.. నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 60,551 వద్ద కనిష్ఠాన్ని తాకింది. రోజులో 869 పాయింట్లు కదలాడిన సూచీ.. మరోదశలో 61,420 గరిష్ఠానికి చేరింది. చివరికి 101.88 పాయింట్ల నష్టంతో.. 60,821 వద్ద ముగిసింది.